Jupalli Krishna Rao: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా.. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. పోటాపోటీ కార్యక్రమాలతో అధికార, విపక్ష నేతలు జనంలోకి వెళుతున్నారు. తమ గెలుపోటములపై పార్టీలు జోరుగా సర్వేలు నిర్వహిస్తున్నాయి. అదే సమయంలో ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వలసల విషయంలో బీజేపీ పక్కా ప్రణాళిలతో ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా కమలం పార్టీలో చేరికలు సాగుతున్నాయి. మరికొందరు కీలక నేతలు కాషాయ గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవలే ఆయన ఖమ్మం జిల్లాకు వెళ్లి టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు. అప్పుడే బీజేపీలో చేరిక గురించే వీళ్ల మధ్య చర్చ జరిగిందనే వార్తలు వచ్చాయి. తర్వాత తన అనుచరులతో సమావేశాలు నిర్వహించారు జూపల్లి. బీజేపీ పెద్దలతోనూ ఆయన మంత్రాంగం నడిపారనే వార్తలు వచ్చాయి. ఏప్రిల్ 27న మాదాపూర్ హైటెక్స్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి జూపల్లి హాజరు కాలేదు. దీంతో రేపో మాపో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని అంతా భావించారు. నేపథ్యంలో తనపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు జూపల్లి కృష్ణారావు.
తాను టీఆర్ఎస్ కు రాజీనామా చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని జూపల్లి కృష్ణారావు చెప్పారు. తనపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
అయితే కారు పార్టీలో కొనసాగుతానని చెబుతూనే.. ప్రభుత్వం తీరు, టీఆర్ఎస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు జూపల్లి. అప్రజాస్వామికంగా, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వాళ్లపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. పోలీస్, రెవిన్యూ శాఖలోని అవినీతి అధికారులపైనా ఎలాంటి చర్యలు లేవన్నారు. జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని జూపల్లి విమర్శించారు. అందుకే తాను ప్లీనరీకి పోలేదన్నారు. ప్రస్తుతానికి తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని.. కాని రేపు ఏం జరుగుతుందో చెప్పలేనన్నారు. తన కార్యకర్తల అభిష్టాన్ని బట్టి తన నిర్ణయం ఉంటుందని జూపల్లి స్పష్టం చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో తన కార్యకర్తలను పోలీసులతో బూటు కాలుతో తన్నారని, రౌడీ షీట్లు ఓపెన్ చేశారని చెప్పారు. మహిళలను, ప్రజలను వేధిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లానని జూపల్లి తెలిపారు. త్వరలోనే పార్టీ అధిష్టానాన్ని కలుస్తానని.. అన్ని విషయాలు వివరిస్తానని జూపల్లి తెలిపారు.
జూపల్లి కృష్ణారావు తాజా ప్రకటనతో ఆయన టీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం కష్టమేననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
READ ALSO: KTR CONTROVERSY SPEECHES: నోరు జారుతున్న కేటీఆర్... ఫ్రస్టేషనా.. పీకే వ్యూహమా?
Minister Venu Gopalakrishna: వేదికపై వైవీ సుబ్బారెడ్డి ముందు మోకరిల్లిన మంత్రి వేణు గోపాలకృష్ణ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.