బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున 5 సభ్యులతో కూడిన నిజ నిర్థారణ కమిటీ జమ్ము కాశ్మీర్‌లోని కథువా ప్రాంతాన్ని సందర్శించాలని భావిస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ 19వ తేదిన సుప్రీం కోర్టు నుండి కొంత సమయం అడగనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీఐ అధినేత మనన్ మిశ్రా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిజ నిర్థారణ కమిటీలో మాజీ బీసీఐ అధినేత తరుణ్ అగర్వాల్‌తో పాటు కో ఛైర్మన్ ఎస్ ప్రభాకరన్, రామచంద్ర జీ షా, ఉత్తరాఖండ్ బార్ కౌన్సిల్ సభ్యులు రజియా బేగ్, నరేష్ దీక్షిత్ కూడా పాలుపంచుకోనున్నారు.
ఈ కమిటీ కథువా ప్రాంతాన్ని సందర్శించి అక్కడి బాధిత కుటుంబంతో పాటు ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించనుంది. ఏప్రిల్ 20 తేదిన కమిటీ కథువా బయలుదేరనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే జమ్ముతో పాటు కథువా ప్రాంత బార్ అసోసియేషన్‌కు తెలియజేశామని బీసీఐ పేర్కొంది
ఈ మేరకు మనన్ మిశ్రా మరికొన్ని విషయాలు కూడా పంచుకున్నారు. ఈ కేసును తప్పుదోవ పట్టించే విధంగా ఎవరైనా న్యాయవాదులు ప్రవర్తిస్తే వారి లైసెన్సులను బార్ కౌన్సిల్ తొలిగిస్తుందని తెలిపారు. అయితే ఒకవేళ బయట వ్యక్తులెవరైనా ఈ కేసు విషయంపై వివాదం చేయాలని భావిస్తే మాత్రం.. అది బార్ కౌన్సిల్ పరిధిలో ఉండదని ఆయన అన్నారు.
ఒకవేళ న్యాయవాదులే కారకులైతే మాత్రం వారి రిజిస్ట్రేషన్లపై జీవితకాలం నిషేధం విధించడానికి కూడా తాము వెనుకాడమని ఆయన తెలిపారు. కమటీ ఒకసారి ఈ విషయంపై సమగ్ర ప్రణాళిక తయారుచేసి నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో కథువా ప్రాంతంలో ఓ 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే