కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీతో కలిసి జత కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జేడీఎస్ అధినేత కుమారస్వామి ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కుమారస్వామి ముఖ్యమంత్రి కావడం ఇది రెండోసారి కాగా మొత్తంగా కర్ణాటకకు ఆయన 24వ ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో 2006 ఫిబ్రవరి 3న తొలిసారి సీఎం అయిన కుమారస్వామి 2007 అక్టోబర్ 9వరకు ఆ పదవిలో ఉన్నారు. అప్పట్లోనూ కాంగ్రెస్ పార్టీతో కలిసి జేడీఎస్ అధికారాన్ని పంచుకోగా జేడీఎస్ తరుపున కుమారస్వామి 20 నెలలపాటు, కాంగ్రెస్ తరపున ధరంసింగ్ 20 నెలలపాటు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఇక ఇవాళ ముఖ్యమంత్రి కుమారస్వామితోపాటు ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత, పీసీసీ అధ్యక్షుడు బి. పరమేశ్వర ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా ఈ ఇద్దరిచేత కన్నడలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నెల 25న కుమారస్వామి అసెంబ్లీలో తన మెజార్టీని నిరూపించుకోవాల్సి వుండగా ఆ తర్వాత వారం రోజులకు రాష్ట్ర కేబినెట్ ఏర్పాటు కానుంది. కుమారస్వామి కేబినెట్ లో 22 మంది కాంగ్రెస్ సభ్యులు వుండనుండగా 12 మంది జేడీఎస్ నేతలు వుండనున్నారు.
కర్ణాటక విధాన సౌధ ముందు ఏర్పాటు చేసిన వేదికపై జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలతో పాటు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్ సహా మాజీ ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. శరద్ యాదవ్, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి, శరద్ పవార్, అజిత్ సింగ్, అఖిలేశ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ వంటి కీలక నేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన వారిలో వున్నారు.
వాస్తవానికి కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా తలబడ్డాయి. ముఖ్యంగా పాత మైసూర్ ప్రాంతంలో రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. కానీ సీన్ కట్ చేస్తే, ఇప్పుడదే రెండు పార్టీలు కలిసి అధికారం పంచుకోవడం విశేషం. కుమారస్వామి సైతం ఒకానొక సందర్భంలో పీటీఐతో మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్లూ ప్రభుత్వానికి అగ్ని పరీక్ష లాంటిదే అని అంగీకరించారు అంటే పరిస్థితి ఎలా వుండనుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.