'గోటిపువా' అనేది ఒడిశా రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం. ఈ నృత్యానికి పూరీ బాగా ప్రసిద్ధి. వందల ఏళ్ల నుంచి అక్కడి ప్రజలు దీన్ని ప్రదర్శిస్తున్నారు. అబ్బాయిలు.. అమ్మాయి వేషం ధరించి ప్రదర్శించడం ఈ నాట్యానికి ఉన్న ప్రత్యేకత. 'గోటి' అంటే ఒంటరి అని, 'పువా' అంటే అబ్బాయి అని అర్థం. గోటిపువా నృత్యం గురించి చాలా మందికి తెలీదు. తెలిస్తే థ్రిల్‌గా ఫీలవుతారు.
గోటిపువా చరిత్ర
ఒడిశాలో ప్రధాన మతం వైష్ణవ మతం. ఈ కళాకారులు వైష్ణవ గాధలు, పురాణాలు, దశావతారాలు, రాసలీలలను ప్రదర్శిస్తారు. పూరీ మహారాజు అప్పట్లో 'గోటిపువా' కోసం ప్రత్యేకంగా పాఠశాలలను ఏర్పాటుచేశారు. విద్యార్థులు అందులో చేరి కళను నేర్చుకునేవారు. అలా నేరుకున్న కళను రాజులు, జమీందార్లు ముందు ప్రదర్శించేవారు. ఇప్పుడు రాజులు లేరు.. రాజ్యాలు లేవు. దాంతో ఈ కళలకు ఆదరణ లేక దాదాపు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా ఈ కళ మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
గోటిపువా చూడటానికి ఒక వ్యాయామ విద్య గా కనిపిస్తుంది. ఇందులో బాలురు ట్రూప్ (బృందం)గా ఏర్పడుతారు. ఒక్కో ట్రూప్‌లో 20 మంది ఉంటారు. మత్స్య, కూర్మ అవతారాలను ప్రదర్శిస్తారు. పక్షులు, జంతువులనూ అనుకరిస్తూ భంగిమలు చేస్తారు. వాళ్ల ప్రదర్శనను చూస్తున్నంతసేపూ వాళ్లు అచ్చం ఆడవాళ్లలాగే కనిపిస్తారు. కదలికల్లో, మేకప్ లో ఎక్కడా అబ్బాయిలు అని తెలియదు. నృత్యం పూర్తయిన తరువాత ఆఖరికి వ్యాఖ్యాత గోటిపువా నృత్యం గురించి మాట్లాడతారు. పూర లో పుట్టిన ఈ ప్రాచీన కళ, దేవదాసీలకు ప్రత్యామ్నాయంగా, హిందూ మత విశ్వాసానికి ఆధారంగా పుట్టిందనేద కొందరి భావన. వీరి దుస్తులు, ఆభరణాల అలంకరణ వైవిధ్యంగా ఉంటుంది. ఈ సంప్రదాయ దుస్తులను 'కంచులా' అంటారు. పండుగలు, జాతర, ఉత్సవాలు లాంటి సందర్భాలలో 'గోటిపువా' నృత్యాన్ని ప్రదర్శిస్తుంటారు.