AP Volunteers on Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నమోదు చేసిన కేసు పునర్విచారణ చేయాలని హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. వాలంటీర్లపై గత ప్రభుత్వంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్‌పై కూటమి ప్రభుత్వం కేస్ ఉపసంహరించుకోవడంపై హైకోర్టులో ఇద్దరు మహిళా వాలంటీర్లు క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.
గత ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని.. వారిని వ్యభిచార కూపంలోకి దించడానికి వాలంటీర్లే కారణమని పవన్ కళ్యాణ్ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై అప్పటి వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదుకు జీవో కూడా జారీ చేసింది. గుంటూరు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రధాన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు గుంటూరులోని నాలుగో అదనపు జిల్లా కోర్టు పవన్ కళ్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్‌పై ప్రభుత్వం కేసు ఉపసంహరించుకుంది.
గుంటూరు జిల్లా కోర్టు పరిధి దాటి పవన్ కళ్యాణ్‌పై ప్రభుత్వం కేసు ఉపసంహరణకు అనుమతి ఇచ్చిందని వాలంటీర్లు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.
30 వేల మంది వాలంటీర్లను పవన్ కళ్యాణ్ అవమానపరిచారని.. కేసు వెనక్కి తీసుకోవడం అధికార దుర్వినియోగానికి అద్దం పడుతుందని పిటిషన్లో పేర్కొన్నారు.
పిటిషనర్ల తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. ఈ కేసు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.