Things to Avoid to Donate in Evenig: దానం చేయడం అనేది ఒక గొప్ప అలవాటు. మన వద్ద ఉన్నదాన్ని నలుగురికి పంచిపెడితే.. అది పెరుగుతుందే కానీ తరగదు అనేది పెద్ద వాళ్లు చెప్పే మాట. ఏ మతమైనా.. ఏ ధర్మమైనా అదే బోధిస్తుంది. అయితే, అదే సమయంలో దానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయని మన పెద్ద వాళ్లే చెబుతుంటారు. దానానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని.. ఆ హద్దులు మీరి దానాలు చేస్తూపోతే.. ఆ తరువాత వారిని అదృష్టం వీడి దరిద్రం వెంటపడుతుందని హెచ్చరిస్తుంటారు.
ముఖ్యంగా సాయంత్రం వేళ చేసే కొన్ని రకాల దానాలు లక్ష్మీ దేవికి కోపం తెప్పించడం వల్ల అనర్థాలు సంభవించి ఇంట్లో ఆనందం, శాంతి ఆవిరైపోతాయని చెబుతుంటారు. అలా సాయంత్రం పూట దానం చేయకూడని వస్తువులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
పొరపాటున కూడా సాయంత్రం పూట వీటిని దానం చేయొద్దు
డబ్బు దానం
డబ్బును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటాం. అందులోనూ సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించడానికి సరైన సమయంగా భావిస్తుంటాం. అలాంటి సాయంత్రం సమయంలో డబ్బుని దానం చేస్తే.. లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుందట. ఇక మీకు డబ్బు అవసరం లేదని భావిస్తూ మీకు దూరంగా వెళ్లిపోతుందట. అందుకే డబ్బు విషయంలో సాయంత్రం పూట దానం కాదు సరికదా.. ఎవ్వరూ అప్పు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు.
పాలు
పాలను చంద్రునికి గుర్తుగా భావిస్తుంటాం. మరీ ముఖ్యంగా చంద్రుడు పగలు సమయంలో పోల్చుకుంటే సాయంత్రం వేళనే ఎక్కువ శక్తివంతంగా తయారవుతాడు. సాయంత్రం వేళ లక్ష్మి దేవి కూడా భూలోకంలో సంచరిస్తుంటారు అనే భావన ఉంది. అందుకే సాయంత్రం సమయంలో పొరపాటున కూడా పాలు దానం చేయొద్దు. అలా చేయడం వల్ల చంద్రుడి నుంచి, లక్ష్మీ దేవి నుంచి ఆశీర్వాదాలు దూరమై ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయట. డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.
ఉల్లిపాయ మరియు వెల్లుల్లి
ఉల్లిపాయ, వెల్లుల్లి తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ఈ రెండు కూడా చాలా కేతు గ్రహానికి సంబంధించినవిగా చెబుతుంటారు. మీరు కానీ ఒకవేళ సాయంత్రం సమయంలో ఎవరికైనా ఉల్లిగడ్డ, వెల్లుల్లి వంటివి దానం చేస్తే.. అలా చేసే దానం మీ జాతకంలో కేతు గ్రహ స్థితిని బలహీనపరుస్తుందట. కేతు గ్రహ స్థితి బలహీనపడిన వారి ఇంట్లో ఇబ్బందులు ఎక్కువవడం, పొరుగువారితో కలహాలు రావడం, నిద్రలేమి సమస్య, గాయాల పాలవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
పెరుగు
పెరుగు శుక్ర గ్రహానికి సంకేతంగా భావిస్తుంటారు. శుక్ర గ్రహం అంటేనే భౌతిక సుఖాలు, శ్రేయస్సుకు సంకేతం. సాయంత్రం వేళ ఎవరికైనా పెరుగు దానం చేస్తే.. మన ఇంట్లో ఉన్న భౌతిక సుఖాలు, శ్రేయస్సు కూడా ఇంట్లోంచి వెళ్లిపోతాయంట. తద్వారా కుటుంబంలో సుఖ సంతోషాలు, ప్రశాంతత దూరమై దరిద్రం వెంటపడుతుంది. అందుకే పొరపాటున కూడా సాయంత్రం సమయంలో పెరుగు ఎవరికీ దానం చేయకూడదని పెద్దలు హెచ్చరిస్తుంటారు.
( గమనిక: ఈ కథనంలో ప్రస్తావించిన సమాచారం సమాజంలోని విశ్వాసాల ఆధారంగా రాసినవి. ఈ అభిప్రాయాలు, సూచనలతో జీ న్యూస్ ఏ విధంగానూ ఏకీభవించడం లేదు )