కామన్వెల్త్‌లో సంచలనం: టీటీ సింగిల్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన మనికా బత్రా..!

కామన్వెల్త్ క్రీడల్లో మరో సంచలనం నమోదైంది. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో భారతదేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించింది క్రీడాకారిణి మనికా బత్రా. 

Last Updated : Apr 15, 2018, 08:44 AM IST
కామన్వెల్త్‌లో సంచలనం: టీటీ సింగిల్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన మనికా బత్రా..!

కామన్వెల్త్ క్రీడల్లో మరో సంచలనం నమోదైంది. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో భారతదేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించింది క్రీడాకారిణి మనికా బత్రా. సింగపూర్ క్రీడాకారిణి మెయినగ్యు యూతో జరిగిన హోరాహోరీ పోరులో మనికా 11-7, 11-6, 11-2, 11-7 పాయింట్లతో విదేశీ వనితను మట్టికరిపించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 

తద్వారా కామన్వెల్త్ చరిత్రలో భారతదేశానికి టేబుల్ టెన్నిస్‌‌లో స్వర్ణపతకం తీసుకొచ్చిన మొదటి మహిళగా రికార్డులకెక్కింది. సెమీ ఫైనల్‌లో ఈమె వరల్డ్ నెంబర్ ఫోర్ మరియు ఒలింపిక్ మెడల్ గ్రహీతైన సింగపూర్ క్రీడాకారిణి తియాన్వై ఫెంగ్‌ను ఓడించడం విశేషం. ఈమె ఇటీవలే జరిగిన టీటీ డబుల్స్‌లో కూడా రజత పతకం కైవసం చేసుకోవడం విశేషం. అలాగే టీటీ టీమ్ ఈవెంట్‌లో కూడా ఈమె ఇటీవలే స్వర్ణ పతకం గెలుచుకుంది

మనికా బత్రా 2011లో తొలిసారిగా అండర్ 21 విభాగంలో చిలీ ఓపెన్ టేబుల్ టెన్నిస్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అలాగే 2014లో గ్లాస్కో కామన్వెల్త్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లింది. అలాగే అప్పుడు కూడా టీమ్ ఈవెంట్‌లో రజతం గెలుచుకుంది. 2016 ఒలింపిక్స్ క్రీడలకు కూడా మనికా బత్రా ఎంపికైంది. అయితే తొలి రౌండ్‌లోనే ఆమె ఇంటిదారి పట్టింది. తాజాగా కామన్వెల్త్‌లో సాధించిన స్వర్ణ పతకంతో మనికా పేరు ప్రస్తుతం మారుమ్రోగిపోతోంది.

Trending News