భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. జహీర్ ఖాన్-సాగరిక వివాహం జరిగిన కొద్ది గంటలకే భువనేశ్వర్ వివాహం జరగడం విశేషం. తన చిన్ననాటి స్నేహితురాలు నుపుర్ నాగర్ ను భువీ వివాహం చేసుకున్నాడు. భువనేశ్వర్ స్వస్థలం మీరట్ లో వీరిద్దరి వివాహం జరిగింది. తాను ప్రేమలో ఉన్నానని ఇదివరకు ట్విట్టర్ లో భువీ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే..!
తాజాగా భువీ-నుపుర్ వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత నెలలోనే వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. నవంబర్ 26వ తేదీన బులంద్షార్ లో, నవంబర్ 30వ తేదీన ఢిల్లీలో రిసెప్షన్ జరగనుంది. "మీరట్ లో జరిగిన పెళ్లి వేడులకు కుటుంబసభ్యులు, అంత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు" అని భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ తెలిపారు.
నవంబర్ 30వ తేదీన ఢిల్లీలో ఇండియా-శ్రీలంక మ్యాచ్ జరగనుంది. కనుక ఢిల్లీలో నిర్వహించే రిసెప్షన్ కు క్రికెటర్లందరూ హాజరవుతారని ఆశిస్తున్నారు. అయితే, పెళ్లి కారణంగా భువనేశ్వర్ నాగ్పూర్ లో జరిగే ఇండియా-శ్రీలంక టెస్ట్ మ్యాచ్ (నవంబర్ 24) ఆడలేకపోతున్నాడు.