ప్రతీ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవం సందర్భంగా యధావిధిగా, ఎంతో అట్టహాసంగా జరిపే ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకను ఈసారి రద్దు చేస్తూ బీసీసీఐ పాలకుల కమిటీ (కమిటి ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చెన్నైలో జరగనున్న 12వ ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవ వేడుకను రద్దు చేస్తూ అందుకు ఖర్చు అయ్యే మొత్తాన్ని పుల్వామా దాడిలో అసువులుబాసిన అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయంగా అందించాలని సీఓఏ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు భారత మాజీ ఆడిటర్ జనరల్, ప్రస్తుత సీఓఏ అధ్యక్షుడు వినోద్ రాయ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇక ప్రపంచ కప్లో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడటంపై స్పందిస్తూ.. ఇప్పటికే ఈ వివాదంపై తమ అభిప్రాయాన్ని వినిపిస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తోపాటు భారత ప్రభుత్వానికి లేఖలు రాసినట్టు వినోద్ రాయ్ తెలిపారు.