7th Class Student Bank Robbery Attempt: 7వ తరగతి బాలుడు ఏకంగా బ్యాంకుకే కన్నం వేశాడు.. కానీ..

7th Class Student Bank Robbery Attempt In Telangana: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఎస్బీఐ బ్యాంకులో చోరీ జరిగింది అనే వార్త గురువారం దావాణంలా వ్యాపించింది. ఎస్బీఐ బ్యాంకు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. నగలు, నగదు లాంటివి ఏవీ దొరక్కపోవడంతో ఉత్తి చేతులతోనే వెనక్కి తిరిగారు అని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక 7వ తరగతి బుడ్డోడు సీన్ లోకి ఎంటరయ్యాడు. 

Written by - Pavan | Last Updated : Jun 30, 2023, 03:59 PM IST
7th Class Student Bank Robbery Attempt: 7వ తరగతి బాలుడు ఏకంగా బ్యాంకుకే కన్నం వేశాడు.. కానీ..

7th Class Student Bank Robbery Attempt In Telangana: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఎస్బీఐ బ్యాంకులో చోరీ జరిగింది అనే వార్త గురువారం దావాణంలా వ్యాపించింది. ఎస్బీఐ బ్యాంకు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. నగలు, నగదు లాంటివి ఏవీ దొరక్కపోవడంతో ఉత్తి చేతులతోనే వెనక్కి తిరిగారు అని అంతా భావించారు. బ్యాంకు తాళాలు పగలకొట్టారు అంటే కచ్చితంగా ఇందులో పెద్ద దొంగల ముఠా ప్రమేయం ఉండి ఉంటుంది అని ఎవరికి వారే హడలిపోయారు. బ్యాంకు చుట్టు పక్కల నివాసం ఉండే వారు సైతం వణికిపోయారు. ఇలాంటి కరడుగట్టిన దొంగల కన్ను తమ ఇంటిపై పడితే తమ పరిస్థితి ఏంటి అని భయాందోళనకు గురయ్యారు. 

కానీ సీన్ కట్ చేస్తే ఆ బ్యాంకు తాళాలు పగలగొట్టి అందులోకి చొరబడింది కరడుగట్టిన దొంగలు కాదు.. అదే గ్రామంలో బ్యాంకుకు సమీపంలోనే నివాసం ఉంటున్న 7వ తరగతి చదివే బాలుడు అని తెలిసి అందరూ నోరెళ్లబెట్టారు. అవును.. ఆ బాలుడు చదివేది 7వ తరగతి.. కానీ ఈ బుడ్డోడు చేసిన పని గురించి వింటే ఎవ్వరైనా సరే షాక్ అవుతారు. ఈ బుడ్డోడికి అంతగా డబ్బులతో ఏం అవసరం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఏకంగా ఇంటికి దగ్గరే ఉన్న ఎస్బీఐ బ్యాంకుకే కన్నం వేశాడు. 

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో జరిగిన ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. బయ్యారంలోని ఎస్బీఐలో దొంగలు పడ్డారనే వార్త అక్కడి గ్రామస్తులకు వణుకు పుట్టించింది. ఈ రోజు ఉదయం బ్యాంకు ఆవరణను శుభ్రం చేసేందుకు వచ్చిన ఓ మహిళ బ్యాంక్‌ తాళాలు పగులగొట్టి ఉండటం చూసి షాకైంది. బ్యాంకు తాళాలు పగలగొట్టి ఉండటం చూసి సీన్ బ్యాంకులో దొంగలు పడ్డారని అర్థం చేసుకున్న ఆ మహిళ వెంటనే బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌కు సమాచారం అందించింది.

ఆ మహిళ ఇచ్చిన సమాచారంతో ఖంగుతిన్న బ్యాంక్ మేనేజర్‌ శ్రీనివాస్.. అదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో హుటాహుటిన సీఐ బాలాజీ, ఎస్సై రమాదేవి బ్యాంక్‌ వద్దకు వెళ్లి పరిశీలించారు. బ్యాంకు తాళాలు పగలగొట్టిన దొంగలు లోపలికి ప్రవేశించిన మాట వాస్తవమే కానీ బ్యాంకు లాకర్లు, నగదు ఉన్న రూమ్ జోలికి వెళ్ల లేదు అని గ్రహించారు. బ్యాంకులో నగదు, ఆభరణాలు చోరీకి గురికాలేదని నిర్ధారించుకుని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సీసీ టీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. 

బ్యాంక్‌లో చోరీకి యత్నించింది పెద్ద దొంగల ముఠా కాదు.. అదే ఊరిలో బ్యాంకు సమీపంలోనే నివాసం ఉంటున్న ఒక ట్రాక్టర్ డ్రైవర్ కుమారుడైన ఏడో తరగతి చదువుతున్న బాలుడు అని తెలిసి షాకయ్యారు. గడ్డపారతో బ్యాంక్‌కు వచ్చిన ఆ బాలుడు ముందు గేటు తాళాలు పగులగొట్టాడు. ఆ తర్వాత బ్యాంక్‌ డోర్‌ కూడా పగులగొట్టి దర్జాగా బ్యాంక్‌ లోపలికి వెళ్లాడు. బ్యాంక్‌ లోపలికి వెళ్లగా.. ఎక్కడ డబ్బులు కనబడలేదు. దీంతో వెనుదిరిగాడు. విచిత్రం ఏంటంటే.. అతడు ఇదంతా చేసింది ఏ అర్ధరాత్రి వేళ కాదు.. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలోనే బాలుడు ఈ చోరీకి యత్నించాడు. 

ఇది కూడా చదవండి : Hotel Waiter To IAS Officer: హోటల్లో వెయిటర్‌గా పనిచేసుకుంటూ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు

బాలుడి ఇంటికి వెళ్లి విచారించగా.. బ్యాంక్‌ చోరీకి యత్నించింది తానేనని ఒప్పుకున్నాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్న పోలీసులు.. బాలుడి భవిష్యత్ దృష్ట్యా అతడిని మందలించి, కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. సినిమాల్లో పిల్లలు పెద్ద పెద్ద నేరాలు చేసి పెరిగి పెద్దయిన తరువాత కూడా గ్యాంగ్‌స్టర్స్‌గా కథను నడిపించిన సినిమాలు అనేకం వచ్చాయి. అలాంటి సినిమానే ఏదో ఈ పిల్లాడిపై కూడా తీవ్ర దుష్ప్రభావం చూపించినట్టుంది కాబోలు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలుడి భవిష్యత్ దృష్ట్యా మేము ఆ వీడియోను ఇక్కడ చూపించడం లేదు. 

ఇది కూడా చదవండి : Interesting Facts about King Cobra Snakes: నాగు పాములు సిగ్గు పడతాయనే విషయం తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News