తెలంగాణ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఒక్కొక్కరూ తమకు తోచిన రీతిలో ఓట్లు అడుగుతున్నారు. ఈ కోవలోనే కోరుట్ల ఇండిపెండెంట్ అభ్యర్ధి ఆకుల హనుమంతు వచ్చి చేరారు. అందర్ని ఆశ్చర్యానికి గురిచేసేలా వినూత్న రీతిలో ప్రచారం చేసి జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలతో పాటు అనేక మంది ఇండిపెండెంట్లు బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో కోరుట్ల నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన ఆకుల హనుమంతు అనే ఓ అభ్యర్ధి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ఈ సందర్భంగా తనను గెలిపిస్తే ఏం చేస్తారో వివరిస్తున్నారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖతో పాటు ఓ చెప్పును పంచుతూ వస్తున్నారు. తాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినా..అవినీతికి పాల్పడిన తనకు ఈ చెప్పుతో కొట్టాలని..అంతేకాదు తన రాజీనామా లేఖను స్పీకర్ పంపించి ఆమోదింపజేయాలని ఓటర్లను కోరుతున్నారు.
ఆకుల హనుమంతు వాస్తవానికి అంతగా ప్రచారానికి చోచుకోని వ్యక్తి. వ్యవసాయం చేసుకుంటూ డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్నారు. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న ఇండింపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు. వాస్తవానికి ఆయనకు ప్రజా బలం ఎంత ఉందో దేవుడెరుగు.. అయితే ఆయన చేస్తున్న ప్రచార తీరుకు జనాలు ఫిదా అవుతున్నారు. ఆయన ప్రచారానికి మంచి స్పందన వస్తోంది.