Bandi Sanjay : అందుకే ప్రీతి మృతదేహాన్ని ఆచారం ప్రకారం ఖననం చేయనివ్వలేదు.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Bandi Sanjay Allegations on Preethi Death Case: ఒక వర్గానికి చెందిన నిందితుడికి కొమ్ముకాస్తున్నారని.. అందుకే ప్రీతి మృతి విషయంలో వాస్తవాలు వెలుగులోకి రాకుండా ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు బెదిరించారు అని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రీతి చనిపోయిన తరువాత పోలీసులు ఆమె మొబైల్ అన్లాక్ చేసి ఆధారాలను మాయం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. 

Written by - Pavan | Last Updated : Mar 6, 2023, 04:51 AM IST
Bandi Sanjay : అందుకే ప్రీతి మృతదేహాన్ని ఆచారం ప్రకారం ఖననం చేయనివ్వలేదు.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Bandi Sanjay Allegations on Preethi Death Case: వరంగల్: మెడికో ప్రీతి మృతి విషయంలో తెలంగాణ సర్కారు తీరుపై కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ప్రీతి ఎంజీఎం ఆసుపత్రిలోనే చనిపోయిందని.. కాకపోతే ఆ విషయం అప్పుడే చెబితే విద్యార్థులు తిరగబడతారనే భయంతో ప్రీతి డెడ్ బాడీని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్టు డ్రామా ఆడారు అని బండి సంజయ్ ఆరోపించారు. మహిళలపై కొనసాగుతున్న అత్యాచారాలతోపాటు ప్రీతి ఘటనకు నిరసనగా ఆదివారం వరంగల్ పోచమ్మ మైదాన్ నుండి కాకతీయ మెడికల్ కాలేజీ వరకు బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒక వర్గానికి చెందిన నిందితుడికి కొమ్ముకాస్తున్నారని.. అందుకే ప్రీతి మృతి విషయంలో వాస్తవాలు వెలుగులోకి రాకుండా ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు బెదిరించారు అని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రీతి చనిపోయిన తరువాత పోలీసులు ఆమె మొబైల్ అన్లాక్ చేసి ఆధారాలను మాయం చేశారని.. నిందితుడి వర్గానికి చెందిన ఓట్లు పోతాయనే భయంతోనే ఈ కేసును చిన్న సంఘటనగా చిత్రీకరించడంతో పాటు నిందితుడిని హీరోగా చూపే కుట్ర జరుగుతోంది అని మండిపడ్డారు. 

ప్రీతి మృతి అనంతరం ఆ వాస్తవాలు ఎప్పటికీ వెలుగుచూడకుండా శాస్త్రం ప్రకారం కాకుండా ఆనవాయితీకి విరుద్ధంగా ప్రీతి అంత్యక్రియలు నిర్వహించేలా చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రీతి మృతి కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని.. వాస్తవాల నిగ్గు తేలేలా విచారణ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని.. అందుకు కారణమైన కేసీఆర్ సర్కార్ తీరును నిరసిస్తూ రేపు సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టనున్నట్టు బండి సంజయ్ స్పష్టంచేశారు.

Trending News