తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు..

Last Updated : Aug 21, 2017, 11:08 AM IST
  • తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి గవర్నర్ విధానానికి ఇక చెక్
  • ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు !
  • కసరత్తు చేస్తున్న మోడీ సర్కార్
  • ఏపీకి గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ , తెలంగాణకు డి.హెచ్ శంకరమూర్తి.
  • ఇరు రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం నిర్ణయం
తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు..

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్ గా నరసింహన్ ఒక్కరే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇక నుంచి ఈ పరిస్థితి మారనుంది. పాలనా సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లలను నియమించాలని కేంద్రం యోచిస్తోంది. విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దేందుకుగాను.. ఆస్తులు, జల వనరుల పంపిణీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఇరు రాష్ట్రాలకు ఇప్పటి వరకు కేంద్రం ఒకే గవర్నర్ ను కొనసాగిస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాల పాలన వేర్వేరు రాజధానుల నుంచి జరుగుతున్న నేపథ్యంలో పాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించాలని కేంద్రం భావిస్తోంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం కేంద్రం దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.

ఈ ప్రక్రియ అమల్లోకి వస్తే తెలంగాణ రాష్ట్టానికి కర్నాటక విధాన పరిషత్ సభాపతి, బీజేపీ సీనియర్ నేత చెందిన డి.హెచ్ శంకరమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ లను నియమించే అవకాశముందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.ఈ విషయంలో కేంద్రం పెద్దలు..ఇరువురితో ఇప్పటికే సంప్రదించినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా ఈ విషయంలో విపక్షాల స్వరం వేరుగా ఉంది. ఏపీ విభజన చట్టం ప్రకారం ఉభయ రాష్ట్ట్రాలకు పదేళ్ల పాటు ఒకే గవర్నర్ ఉండాలని వాదిస్తున్నాయి. కాగా విభజన చట్టంలో ఉభయ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండాలని పేర్కొనలేదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. గవర్నర్లలను నియమించే అధికారం కేంద్రానికి ఉందంటున్నారు కమలనాథులు.

Trending News