Constable Died in Gym: జిమ్‌లో వర్కౌట్ చేస్తూ కానిస్టేబుల్ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్

Constable Died in Gym: జిమ్‌లో పుషప్స్, స్ట్రెచెస్ చేసిన వెంటనే విశాల్‌కి విపరీతమైన దగ్గు రావడంతో ఊపిరి తీసుకోవడానికి కూడా అవస్థ పడ్డాడు. చుట్టూ ఉన్న వారు వచ్చేలోపే విశాల్ అక్కడే కుప్పకూలిపోయాడు. తోటి మిత్రులు విశాల్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2023, 07:06 PM IST
Constable Died in Gym: జిమ్‌లో వర్కౌట్ చేస్తూ కానిస్టేబుల్ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్

Constable Died in Gym: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు ఇటీవల కాలంలో జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటనలు అనేకం వెలుగుచూశాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ పోలీసు కానిస్టేబుల్ కూడా ఫిజికల్ ఫిట్నెస్ కోసం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బోయిన్‌పల్లిలో ఈ ఘటన జరిగింది.

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ చనిపోయిన కానిస్టేబుల్‌ని విశాల్‌గా గుర్తించారు. ఆసిఫ్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న విశాల్ వయస్సు 24 ఏళ్లు. ఎప్పటిలాగే గురువారం సాయంత్రం కూడా జిమ్‌కి వెళ్లాడు. జిమ్‌లో పుషప్స్, స్ట్రెచెస్ చేసిన వెంటనే విశాల్‌కి విపరీతమైన దగ్గు రావడంతో ఊపిరి తీసుకోవడానికి కూడా అవస్థ పడ్డాడు. చుట్టూ ఉన్న వారు వచ్చేలోపే విశాల్ అక్కడే కుప్పకూలిపోయాడు. తోటి మిత్రులు విశాల్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 

విశాల్ వర్కౌట్స్ చేయడం నుంచి ఉన్నట్టుండి కుప్పకూలే వరకు అక్కడి దృశ్యాలన్నీ జిమ్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ విజువల్స్ పరిశీలిస్తే.. విశాల్ చురుకుగా వర్కౌట్స్ చేయడం స్పష్టంగా కనిపిస్తుంది. పుషప్స్ చేసిన అనంతరమే అతడు ఆయాసానికి గురై కుప్పకూలిపోయాడు.

24 ఏళ్ల యువకుడు.. అందులోనూ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ నిత్యం ఫిట్‌గా ఉండే విశాల్ ఇలా ఉన్నట్టుండి వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు బారినపడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. విశాల్ మృతితో అతడు నివాసం ఉంటున్న బోయిన్‌పల్లిలో విషాద చాయలు అలుముకున్నాయి. చేతికి అందొచ్చిన కొడుక్కు ఎంతో భవిష్యత్ ఉందని సంబరపడితే.. ఇలా అర్థాంతరంగా గుండెపోటుతో మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Trending News