Narendra Modi: నేను ప్రధానినే కాదు.. నేను భారతమాత పూజారిని: జగిత్యాల సభలో మోదీ

Modi Election Tour: ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలో మూడో రోజు పర్యటించారు. జగిత్యాల వేదికగా జరిగిన సభలో రాహుల్‌, రేవంత్‌ రెడ్డిపై విమర్శలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 18, 2024, 03:56 PM IST
Narendra Modi: నేను ప్రధానినే కాదు.. నేను భారతమాత పూజారిని: జగిత్యాల సభలో మోదీ

Narendra Modi: 'మే 13వ తేదీన తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. పార్టీ క్రమంగా బలపడుతోంది. వికసిత భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారు. 400 దాటాలి... బీజేపీకి ఓటు వేయాలి' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్.. చార్ సౌ పార్ అని నినదిస్తున్నారని వివరించారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని జగిత్యాలలో సోమవారం నిర్వహించిన 'విజయ సంకల్ప సభ'లో ప్రధాని మోదీ మాట్లాడారు.

Also Read: Narendra Modi: మాకు 400 సీట్లు ఇస్తే వికసిత్‌ భారత్‌.. వికసిత్‌ ఏపీ సాధ్యం: ప్రధాని మోదీ

ఈ సభా వేదికగా జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డిని లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. 'తనకు ప్రతి మహిళా ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తోంది. శక్తిని వినాశనం చేసేవాళ్లకు.. శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరుగుతోంది. నేను భారతమాతకు పూజారిని. శివాజీ మైదానంలో రాహుల్ గాంధీ.. తన పోరాటం శక్తికి వ్యతిరేకంగా అని చెప్పారు. శక్తిని వినాశనం చేస్తానని ఎవరైనా అంటారా..? శక్తిని ఖతమ్ చేస్తానన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నా. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4న తెలుస్తుంది' అని తెలిపారు. 

Also Read: Kavitha: కవితను కలిసిన కేటీఆర్‌, హరీశ్ రావు.. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి సిద్ధం

 

తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ.. 'తెలంగాణ.. ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల. ఆంగ్లేయులు, రజాకార్లపై తెలంగాణ సమాజం విరోచిత పోరాటం చేసింది. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను దోచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని తన ఏటీఎంగా మార్చుకుంది. తెలంగాణ డబ్బు ఇప్పుడు ఢిల్లీ చేరుతోంది. ఒక దోపిడీదారు.. మరో దోపిడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్‌ మౌనం వహిస్తోంది. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పని అయిపోతుంది. తెలంగాణ కలలను కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు నాశనం చేశాయి. అధికారంలోకి రాకముందు అనేక మాటలు మాట్లాడిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం సహా దేనిపైనా విచారణ చేయడం లేదు' అని తెలిపారు. 

కేంద్రం చేసిన పనులను మోదీ వివరిస్తూ.. 'రూ.6,400 కోట్లతో రామగుండం ఎరువులు ఫ్యాక్టరీని పునరుద్ధరించాం. పసుపు ధరను క్వింటాల్ కు రూ.6వేల నుంచి రూ.30 వేలకు పెంచాం. ఇక్కడి ప్రభుత్వాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయాయి. మళ్లీ అధికారంలోకి రాగానే వచ్చే పదేళ్ల తెలంగాణ ప్రగతిపై దృష్టి పెడతాం. తెలంగాణలో రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేస్తాం' అని హామీ ఇచ్చారు.

'తెలంగాణలో బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్టుకుపోతాయి. మాకు అధికారం కాపుడుకోవడం కన్నా.. ప్రజల శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకోవడమే ముఖ్యం. మేం అధికారంలో ఉంటే.. ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల అవినీతిపై కేంద్రం విచారణ చేపడితే.. మోడీని తిట్టడం ప్రారంభిస్తున్నారు. తెలంగాణను దోచుకున్న వారిని మేము విడిచిపెట్టేది లేదు' అని స్పష్టం చేశారు. తమకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. జూన్ 4వ తేదీన ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి అని కోరారు.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News