Telangana CM KCR Press Meet After Cabinet Meeting Over Paddy Procurement: తెలంగాణ రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. యాసంగిలో పండిన ధాన్యం మొత్తంను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. క్వింటాల్ ధాన్యానికి రూ.1960 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. దాంతో తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా నెలకొన్న ధాన్యం కొనుగోలు వివాదానికి కేసీఆర్ ముగింపు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకున్నది.
కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. 'కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పండిన యాసంగి పంటను సేకరించకుండా సంకుచితంగా వ్యవహరిస్తోంది. సాంఘిక ప్రయోజనం చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం వ్యాపార మనస్తత్వంతో కేవలం ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే చూస్తున్నది. కేంద్ర నిర్ణయం రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారింది. అయితే ప్రజలతో, రైతులతో నిత్య ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల పట్ల నిబద్ధతను ప్రదర్శించింది. వద్దన్నా రాష్ట్రంలో కొంతమంది రైతులు వరి సాగు చేశారు. ఇప్పుడా వరి కొనుగోలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెనుభారంగా మారింది. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించిన కేబినేట్.. కన్న బిడ్డలను కాపాడుకునే తండ్రి మనస్తత్వంతో రైతులను ఆదుకోవాలని నిర్ణయించింది' అని సీఎం అన్నారు.
'భారత ప్రజల ముందు ఈ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని ఢిల్లీలో ధర్నా చేశాం. బ్యాంకులను ముంచిన కార్పొరేట్లను అరెస్టు చేయకుండా కాపాడుతారు. బడా కంపెనీలకు రూ.1.50 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు కానీ తెలంగాణలోని 60 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.3500 కోట్లు మాఫీ చేయలేదు. రైతులను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. రైతాంగాన్ని కాపాడుకోవాలని కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించాం. యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. సీఎస్ నేతృత్వంలో ఒక కమిటీ వేశాం. ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఒక్క గింజ కూడా రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దు. ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుంది. క్వింటాలుకు రూ.1960లు చెల్లిస్తాం. డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం' అని కేసీఆర్ చెప్పారు.
వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వపరంగా ఇచ్చిన హామీ మేరకు జీవో 111ను ఎత్తివేశామని సీఎం కేసీఆర్ చెప్పారు. న్యాయపరమైన చిక్కులు అధిగమించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. తెలంగాణలో కొత్తగా 6 ప్రైవేటు యూనివర్సిటీలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారురు. కావేరి అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఫార్మా వర్సిటీ, అమిటీ, సీఐఐ, గురునానక్, ఎంఎన్‌ఆర్ వర్సిటీలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం పేర్కొన్నారు. మే 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతిని చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Also Read: Acharya Trailer: తగ్గేదేలే.. ఆచార్య ట్రైలర్‌కు అప్పుడే 2 మిలియన్ వ్యూస్!
Also Read: Ranbir Kapoor-Alia Bhatt wedding: మరోసారి అలియా, రణ్‌బీర్ పెళ్లి వాయిదా.. కొత్త డేట్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook