Widow Woman pays tribute to late husband on wedding anniversary: భర్త సమాధి వద్దే పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాల్సిన దుస్థితి వస్తే ఆ మహిళ ఆవేదన ఎంత హృదయవిదారకంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి... ఊహించుకోవడం కూడా కష్టమే కదా. కానీ జగిత్యాల వెల్లటూర్ మండలం స్తంభంపల్లిలో ప్రవళ్లిక అనే యువతికి అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితే ఎదురైంది. భర్తతో విడదీయలేని అనుబంధం ఆమెను సమాధి వద్దే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునేలా చేసింది. చూపరులను కన్నీళ్లు పెట్టుకునేలా చేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా వెల్లటూర్ మండలం స్తంభంపల్లికి చెందిన సుదర్శన్ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 2014 మార్చి ౩ న సుదర్శన్, ప్రవళికలకు వివాహం జరిగింది. సుదర్శన్ ఉన్నప్పుడు ప్రతీ సంవత్సరం పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుండేది. కానీ దుగదృష్టవశాత్తుగా ఈసారి పెళ్లి రోజు వేడుకకు భర్త సుదర్శన్ లేకపోవడం ప్రవళ్లికను తీవ్రంగా కలిచివేసింది. భర్త భౌతికంగా దూరమైనా అతనితో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ భర్త సమాధిని పూలతో అలంకరించి కేక్ కట్ చేసి పెళ్లి రోజు జరుపుకున్నారు. భర్త పట్ల ఆమెకున్న అభిమానం, ఆప్యాయత ఆమె చేత ఈ పని చేయించేలా చేసింది. భర్త సమాధి వద్ద ప్రవళ్లిక కేక్ కట్ చేసిన తీరు చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. స్థానికులే కాదు.. ఈ వీడియో చూసిన వాళ్లు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు.