భారత్‌కు వ్యూహాత్మక వాణిజ్య హోదా కల్పిస్తూ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఫెడరల్ నోటిఫికేషన్ జారీ చేసింది. భారత్‌తో వాణిజ్య, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసే క్రమంలో ఎస్టీయే-1 హోదా కల్పించినట్లు అమెరికా తెలిపింది. తాజా నిర్ణయంతో భారత్- అమెరికా వాణిజ్య, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.
ప్రయోజనాలు ఇవే
ఎస్టీయే-1 హోదా ఇచ్చిన దేశాలకు అమెరికా ప్రభుత్వం ఆధునిక సాంకేతికతతో కూడిన రక్షణ ఉత్పత్తుల విక్రయాలపై రాయితీలు ఇస్తుంది. తాజా నిర్ణయంతో ఇప్పటి నుంచి భారత్‌కు కూడా ఆ సదుపాయాలు వర్తిస్తాయి. ఈ హోదా అందుకున్న ఆసియా దేశాల్లో భారత్ మూడోది కాగా.. ఎస్టీయే-1 హోదా కలిగిన ఏకైన దక్షిణాసియా దేశం భారత్ కావడం విశేషం. ఈ జాబితాలో ఆసియా దేశాల్లో ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఉండగా.. భారత్ మూడో ఆసియా దేశం. కాగా ఎస్టీయే-1 హోదా కలిగిన దేశాల జాబితాలో భారత్ 37వ దేశంగా నిలిచింది.
ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం లేకున్నా హోదా దక్కింది
అణు ఇంధన సరఫరాదారుల కూటమి, ఆస్ట్రేలియా కూటమిలో సభ్యుత్వం కలిగి క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థ కలిగి వాసెనార్ ఒప్పందం పత్రంపై సంతకం చేసిన దేశాలకు మాత్రమే అమెరికా ఎస్టీయే-1 హోదా ఇస్తోంది. అయితే వీటిలో అణు ఇంధన సరఫరాదారుల కూటమిలో తప్ప మిగిలిన మూడింటిలో భారత్‌కు సభ్యత్వం ఉంది. అయినప్పటికీ భారత్‌కు మినహాయింపు కల్పిస్తూ అమెరికా ఈ హోదాను ఇవ్వడంపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో భారత్‌తో ఉన్న ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అమెరికా ఈ మేరకు ఎస్టీయే-1 హోదా కల్పించిందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
చైనా మండిపాటుకు కారణం ఇదే
భారత్‌కు ఎస్టీయే-1 హోదా రావడంతో పొరుగుదేశమైన చైనా మండిపడుతోంది. ఎందుకంటే ఎన్‌ఎస్‌జీ కూటమిలో భారత్ ప్రవేశానికి చైనా అడ్డుతగులుతూ వస్తున్న విషయం తెలిసిందే. చైనా వైఖరి వల్లే భారత్‌కు సభ్యత్వం రావడం లేదనే విషయం జగమెరిగిన సంత్యం. దీంతో పాటు భారత్-అమెరికా రక్షణ ఒప్పందాలపై ముఖ్యంగా సాంకేతిక బదలాయింపుపై చైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. మరోవైపు వాణిజ్య రంగంలో భారత్ కంటే ముందున్న తమను కాదని అమెరికా ప్రభుత్వం భారత్ వైపు మొగ్గుచూపడం చైనా మండిపాటుకు మరో కారణం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ తాజాగా భారత్‌కు హోదా రావడం చైనాకు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.