బ్రిటన్ కోర్టుకు హాజరుకానున్న విజయ్ మాల్యా

9 వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా నేడు బ్రిటన్ కోర్టుకు హాజరుకానున్నారు.

Updated: Jul 31, 2018, 05:11 PM IST
బ్రిటన్ కోర్టుకు హాజరుకానున్న విజయ్ మాల్యా

9 వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా నేడు బ్రిటన్ కోర్టులో హాజరుకానున్నారు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ర్టేట్ కోర్టులో నేడు తుది వాదనలు జరగనున్నాయి కనుక మాల్యా తన లాయర్‌తో కలిసి కోర్టుకు రానున్నారు. మాల్యాను తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేస్తున్నది. ఈ కేసులో మాల్యా తరఫున న్యాయవాదులు, భారత్ తరఫు న్యాయవాదులు కీలక డాక్యుమెంట్లను సమర్పించనున్నారు. వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులోని చీఫ్ మెజిస్ట్రేట్ జడ్జి ఎమ్మా ఆర్బత్‌నాట్ ఈ వాదనలను విని.. ఈ కేసు సంబంధించిన తుది తీర్పు తేదీని ప్రకటించే అవకాశం ఉంది. తుది తీర్పు ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నాం కోర్టులో వాదనలు మొదలవుతాయి. విజయ్ మాల్యాపై కేసు వ్యవహారంలో ఈడీ, సీబీఐ  సంయుక్త బృందం బ్రిటన్ బయల్దేరింది. బ్యాంకుల నుండి విజయ్ మాల్యా వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని మోసం చేసిన కేసులో భాగంగా సీబీఐ, ఈడీ బృందం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: భారత్‌కు తిరిగిరానున్న విజయ్ మాల్యా

అంతకు ముందు విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్ హైకోర్టు ఆదేశాలపై అప్పీల్ చేసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. తన ఆస్తులను స్తంభింపచేయడానికి ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని మాల్యా అప్పీల్ చేసుకున్నారు. దీనిని బ్రిటన్ హైకోర్టు మే 8వ తేదీన కొట్టేసి  ఆదేశాలకు నిరాకరించింది. దీంతో ఆయన అప్పిలేట్ కోర్టును ఆశ్రయించగా.. వినతిని పరిశీలించిన కోర్టు తిరస్కరించింది. మే 8 తేదిన హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల 13 భారతీయ బ్యాంకులు తమ రుణాలను రాబట్టుకోవడానికి బ్రిటన్‌లోని మాల్యా ఆస్తులపై భారత తీర్పులను వర్తింపజేసే హక్కు కలుగుతుంది. కాగా ఈ ఎదురుదెబ్బతో  ఆయనకు తదుపరి అపీళ్లకు వెళ్లే దారులు మూసుకుపోయాయి.