భారత్ నుంచి చైనాకు నాన్-బాస్మతి(బాస్మతి రకం కానివి) బియ్యం ఎగుమతి చేసేందుకుగాను తాజాగా మరో ఐదు రైస్ మిల్లులకు అనుమతులు మంజురయ్యాయి. దీంతో భారత్ నుంచి చైనాకు నాన్-బాస్మతి బియ్యం ఎగుమతి చేసే రైస్ మిల్లుల సంఖ్య 24కు చేరింది. భారత్-చైనా దేశాల మధ్య నాన్-బాస్మతి బియ్యం ఎగుమతులపై ఒప్పందం కుదిరిన తర్వాత మొదటి దశలో భాగంగా గత సెప్టెంబర్‌లో నాగపూర్ నుంచి 100 టన్నుల నాన్-బాస్మతి బియ్యం చైనాకు ఎగుమతి అయ్యాయి. ఈ ఏడాది మే నెలలోనే చైనా నుంచి వచ్చిన సంబంధిత అధికారుల బృందం భారత్‌లో పర్యటించి చైనాకు నాన్-బాస్మతి బియ్యం ఎగుమతి చేయగలిగే శక్తిసామర్థ్యాలున్న 19 రైస్ మిల్లులను గుర్తించాయి. దీంతో ఆ 19 రైస్ మిల్లులకు చైనాకు నాన్-బాస్మతి బియ్యం ఎగుమతి చేసే గుర్తింపు లభించింది.
స్వతహాగానే ప్రపంచంలోనే అత్యధిక వరి ఉత్పత్తి సామర్థ్యం కలిగిన దేశంగా పేరొందిన చైనా ప్రతీ ఏడాది 5 మిలియన్ టన్నుల బియ్యాన్ని విదేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం చైనాకు ఏడాదికి 1 మిలియన్ టన్నుల నాన్-బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసే సామర్థ్యం భారత్ కలిగి ఉందని గణాంకాలు చెబుతున్నాయి.