Zee News-Matrize Survey: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అధికార పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలైన తెలుగుదేశం-జనసేనలు కూటమిగా సిద్ధమయ్యాయి. బీజేపీ కూటమిలో చేరుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది. ఈలోగా ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందనే విషయంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ చేసిన సర్వే ఆసక్తి రేపుతోంది.
ఏపీలో ఎన్నికల రణం మొదలైపోయింది. అధికార పార్టీ సమూల మార్పులతో వైనాట్ 175 లక్ష్యంగా అభ్యర్ధుల్ని మార్చుతుంటే తెలుగుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడి తొలి జాబితా విడుదల చేశాయి. వైసీపీ ఇప్పటికే సిద్ధం పేరుతో భీమిలి, దెందులూరు, రాప్తాడులో భారీ బహిరంగ సభలు నిర్వహించగా తెలుగుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో తొలి సభను నిర్వహించాయి. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం-జనసేన పార్టీలు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.మరోవైపు ఈసారి ఏపీలో అధికారం ఎవరిదనే విషయంలో వివిధ జాతీయ సంస్థలు సర్వేలు చేశాయి. టైమ్స్ నౌ, ఇండియా టీవీ, పోల్ స్ట్రాటెజీ, పొలిటికల్ క్రిటిక్ సంస్థలు చేపట్టిన సర్వేల్లో ఏపీలో మరోసారి అధికారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని తేల్చి చెప్పాయి. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలో వస్తుందని అంచనా వేశాయి.
ఇప్పుడు మరో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని లోక్‌సభ నియోజకవర్గాల్లో జీ న్యూస్ -మ్యాట్రిజ్ సంస్థ పోల్ నిర్వహించింది. ఈ సర్వేలో కేంద్రంలో ఎన్డీయేకు ఈసారి 377 సీట్లు వస్తాయని అంచనా వేసింది. గతంలో ఎన్డీయేకు వచ్చిన సీట్లు 351. గత ఎన్నికల్లో యూపీఏకు 90 సీట్లు దక్కగా ఈసారి 94 సీట్లు రావచ్చని చెబుతంది. రానున్న ఎన్నికల్లో ఎన్డీయేకు 43.6 శాతం ఓట్ షేర్ రావచ్చని అంచనా. గత ఎన్నికల్లో ఇది 38.4 శాతం ఉంది. ఇండియా కూటమికి 27.7 శాతం ఓట్లు రావచ్చని అంచనా. గత ఎన్నికల్లో యూపీఏ కూటమికి 26.4 శాతం ఓట్లు వచ్చాయి.
ఏపీలో మళ్లీ వైసీపీదే అధికారం
ఇక జీ న్యూస్-మ్యాట్రిజ్ సంస్థ ఏపీలో సైతం ఇదే సర్వే కొనససాగించింది. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించనుంది. గత ఎన్నికల్లో 22 స్థానాలు దక్కాయి. తెలుగుదేశం-జనసేన కూటమికి ఆరు స్థానాలు దక్కుతాయని జీ న్యూస్-మ్యాట్రిజ్ అంచనా వేసింది. కాంగ్రెస్-బీజేపీలకు ఒక్క సీటు కూడా దక్కదు. ఇదే అభిప్రాయాల్ని అసెంబ్లీకు వర్తింపజేస్తే 133 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి కన్పిస్తోంది. సంక్షేమం-అభివృద్ధి వైపు ప్రజలు మొగ్గుచూపినట్టుగా జీ న్యూస్-మ్యాట్రిజ్ తెలిపింది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని వ్యాఖ్యానించింది.
ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు 48 శాతం ఓట్ షేర్ రానుంది. టీడీపీ-జనసేనకు 44 శాతం వస్తుందని అంచనా. తెలుగుదేశం-జనసేనలు పొత్తుగా వచ్చినా వైఎస్ జగన్ రెండోసారి అధికారంలో రావడాన్ని అడ్డుకోలేరని ఒపీనియన్ పోల్ స్పష్టం చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook