రేషన్ డీలర్లకు రూ.30 కోట్లు విడుదల చేసిన సర్కార్

రేషన్ డీలర్లకు రూ.30 కోట్లు

Last Updated : Oct 6, 2018, 11:35 AM IST
రేషన్ డీలర్లకు రూ.30 కోట్లు విడుదల చేసిన సర్కార్

ఏపీలోని రేషన్ డీలర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా గుడ్ న్యూస్ వినిపించింది. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్రంలోని రేషన్‌ డీలర్లకు గత ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న బకాయిలను విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2015 నవంబరు నుంచి జాతీయ ఆహార భద్రత చట్టం అమలవుతున్నప్పటికీ.. 2016 సెప్టెంబరు వరకు గతంలో ఇచ్చిన పాత పద్ధతి ప్రకారమే క్వింటాలుకు రూ.20 కమీషన్‌నే ప్రభుత్వం డీలర్లకు ఇచ్చింది. అయితే, వాస్తవానికి జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం క్వింటాకు రూ.70 కమీషన్‌ ఇవ్వాల్సి ఉంది. ఇదే విషయమై తమకు రావాల్సి ఉన్న బకాయిలను విడుదల చేయాల్సిందిగా కోరుతూ గతంలో పలు సందర్భాల్లో రేషన్ డీలర్లు ఢిల్లీ స్థాయిలో ధర్నాలు చేపట్టారు. 

రేషన్ డీలర్ల ఆందోళనలపై స్పందించిన కేంద్ర కార్యదర్శి ఇటీవల చట్టం ప్రకారం డీలర్లకు ఇవ్వాల్సి ఉన్న కమీషన్‌‌ని విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే తాజాగా ఏపీ సర్కార్ రేషన్ డీలర్లకు అందాల్సి ఉన్న బకాయిల కోసం రూ.30.14 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్టు తెలుస్తోంది.  

Trending News