బాబు ఢిల్లీ టూర్: నేడు బిజెపియేతర పార్టీలతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు.

Last Updated : Apr 3, 2018, 08:41 PM IST
బాబు ఢిల్లీ టూర్: నేడు బిజెపియేతర పార్టీలతో భేటీ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. అయున రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉంటారు. నేడు, రేపు పలువురు జాతీయ నాయకులు, వివిధ పార్టీల నేతలు, ఎంపీలను కలుసుకోనున్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వారికి వివరించనున్నారు. వారి మద్దతును కూడగట్టి కేంద్రంపై మరింత ఒత్తిడిని తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రత్యేకహోదా సాధన అజెండాగానే చంద్రబాబు హస్తిన పర్యటన ఉంటుందని మంత్రులు స్పష్టం చేశారు.

ఏపీకి చేసిన అన్యాయం, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్ర సర్కార్ వైఫల్యం గురించి ప్రతిపక్ష పార్టీల నేతలకు, ఎంపీలకు ఆయన వివరించనున్నారు. వీలైతే నాయకులను పార్లమెంట్‌లోనే కలుస్తానని స్పష్టం చేశారు.

పార్లమెంట్ సెంట్రల్ హల్‌లో అవిశ్వాసానికి మద్దతిచ్చిన ఆయా రాజకీయ పార్టీల పార్లమెంటరీ పార్టీల నేతలతో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. ప్రత్యేకహోదాకు మద్దతిచ్చినందుకు ఆయా పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలపనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హల్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గేతో కూడ చంద్రబాబునాయుడు సమావేశం కానున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బిజెపియేతర పార్టీలతో కూటమి?

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాల్లో కొత్త సమీకరణాలకు తెరతీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిజెపియేతర పార్టీలతో చంద్రబాబునాయుడు కూటమిని కూడ ఏర్పాటు చేసే అవకాశాలు కూడ కొట్టిపారేయలేమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే రాజకీయ పరిణామాల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదన్నారు.

కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ముఖ్యమంత్రే స్వయంగా ఢిల్లీకి వెళ్తే బాగుంటుందని ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుకున్నారు. దీనికి అనుగుణంగా చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనను ఖరారు చేసుకున్నారు. మోదీ సర్కార్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి పలు పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఏపీ ఎంపీలు నిత్యం పార్లమెంట్‌ లోపలా, బయటా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగి తమ పోరాటానికి ఆయా పార్టీల మద్దతు కూడగట్టనున్నారు.

చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. మోదీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ తమ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేస్తున్న వైనాన్ని వివరించే అవకాశముంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రతిపక్షాలకు విందు ఇచ్చే అవకాశముందని తెదేపా నాయకులు చెప్తున్నారు. బీజేపీ మిత్రధర్మ పాటించలేదని గతంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..! బీజేపీతో సంబంధాలు తెలగిపోయాక చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళడం ఇదే తొలిసారి.

Trending News