అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సీఎం జగన్ భరోసా ఇస్తున్నారు. పరిహారంగా కింద బాధిత ప్రతీ కుటుంబానికి రూ.7 లక్షల ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు త్వరలో చట్టం తీసుకొస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సోమవారం కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు పరిహారం ఇచ్చే విషయంలో విధివిధానాలు రూపొందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 2014-19 వరకు ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు వీటిని అందజేయాలని తెలిపారు.
అధికారుల లెక్కల ప్రకారం 2014-19 సమయంలో మొత్తం 1,513 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడినట్లు రికార్డులు చెబుతుండగా.. ఇప్పటి వరకు కేవలం 391 మంది రైతుల కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇచ్చినట్లు గణాంకాలు ఉన్నాయి. ఈ విషయాన్ని అధికారులు సీఎం దష్టికి తీసుకురాగా... అందరికీ న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాల వారీగా డేటాలను పరిశీలించి అర్హత ఉన్న కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు