సోమవారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణతో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీపీఐ నేత రామకృష్ణ పాల్గొన్నారు. బేగంపేటలోని లోక్‌సత్తా కార్యాలయంలో సమావేశమైన నేతలు తాజా రాజకీయ పరిణామాలు, నిజనిర్ధారణ కమిటీ విధివిధానాలపై చర్చించారు. నిన్న పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన ఉండవల్లి నేడు జేఏసీ (ఐక్య కార్యాచరణ సమితి)పై చర్చించేందుకు జయప్రకాశ్‌తో సమావేశమయినట్లు సమాచారం.
విభజన హామీలపై పోరాటానికి ఇప్పటికే ఆలస్యమైందని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఉండవల్లితో పాటు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ- రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటాల ప్రచారంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నదని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి మా తరఫున ఉడతాభక్తి సహాయం చేస్తామని అన్నారు. చిత్తశుద్ధి తప్ప మా దగ్గర వేరే బలం లేదన్న జేపీ.. ఆ చిత్తశుద్ధితోనే నిజాలు నిగ్గుతేలుస్తామని అన్నారు.