సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాను స్థాపించిన జనసేన పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా ప్రస్తుతం భీమవరంలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ అక్కడే మంగళవారం ఉదయం ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే, అంతకన్నా ముందుగా భీమవరం వాసుల ఇలవేల్పు అయిన మావూళ్లమ్మ దేవాలయంలో అమ్మవారి చెంత ఈ విజన్ డాక్యుమెంట్ ఉంచి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జనసేన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ తొలి కాపీని జనసేన పార్టీ మహిళా కార్యకర్తకు అందజేశారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ విడుదల చేసిన ఈ విజన్ డాక్యుమెంట్లో పొందుపర్చిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
1) మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్
2) గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ
3) రేషన్‌కు బదులుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.2500 నుంచి రూ.3500 వరకు నగదు జమ
4) అవకాశం ఉంటే బీసీలకు 5శాతం వరకు రిజర్వేషన్ల పెంపుదల
5) చట్ట సభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్స్
6) కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్స్
7) ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం
8) ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం కార్పొరేషన్
9) ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థుల కోసం వసతిగృహాల ఏర్పాటు
10) ముస్లింల అభివృద్ధికి సదార్ కమిటీ విధానాలు
11) ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ విధానం రద్దు
12) ఏ ఆధారం లేని వృద్ధుల కోసం ప్రభుత్వ వృద్ధశ్రమాల ఏర్పాటు
ఈ అంశాలను సాహసోపేతమైన నిర్ణయాలుగానే భావించినప్పటికీ.. మనసు ఉంటే మార్గం ఉంటుందనే ఆలోచనతో వీటిని విజన్ డాక్యుమెంట్లో వీటిని పొందుపర్చినట్టు పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. త్వరలోనే పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రతిని విడుదల చేయనున్నట్టు ఈ సందర్భంగా జనసేన పార్టీ స్పష్టంచేసింది.