మీ వాహానం చోరీకి గురైందా ? చోరీకి గురైన వాహనం ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారా ? అయితే, ఇకపై ఆ సమస్యలు ఏవీ వుండవు లెండి అంటున్నారు ఏపీ పోలీసులు!! ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన పిన్స్ (ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నెట్‌వర్కింగ్ సిస్టమ్) అనే మొబైల్ యాప్‌ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటే, అందులో మీ వాహనం రిజిస్ట్రేషన్, చాసిస్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేస్తే చాలు... ప్రస్తుతం ఆ వాహనం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ పోలీసు స్టేషన్ పరిధిలో వుందనే విషయం తెలిసిపోనుంది. వెంటనే వాహనానికి సంబంధించిన పత్రాలతో సదరు పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌ని సంప్రదిస్తే, చట్టపరమైన ప్రక్రియ అనంతరం ఆ వాహనాన్ని బాధితుడికి అప్పగించడమే ఈ పిన్స్ యాప్ వెనుకున్న అంతిమ లక్ష్యం. అయితే, పోలీసులకి పట్టుబడిన వాహనాల్లో మీ వాహనం వున్నట్టయితేనే అది సాధ్యపడనుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసు స్టేషన్ల పరిధిలో పట్టుబడిన వివరాలు మాత్రమే ఈ పిన్స్ యాప్‌లో అందుబాటులో వుంటాయనే విషయం గ్రహించాలి.
ప్రమాదాలకు గురైన వాహనాలు, తనిఖీల్లో సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు, వాహనాల దొంగలు పట్టుబడినప్పుడు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలు భారీ సంఖ్యలో పోలీసు స్టేషన్లలో ఓ మూలన పేరుకుపోతున్నాయి. చాలా సందర్భాల్లో ఆయా వాహనాల అసలు యజమానులు ఎవరో తెలిసే ఛాన్స్ కూడా లేకపోవడంతో అవి అలాగే ఏళ్ల తరబడి మూలన పడి వుండటం, ఎందుకూ పనికిరాని దశలో వాటిని స్క్రాప్‌కి వేలం వేయడం జరుగుతోంది. అయితే, ఈ సమస్యకు ఓ చెక్ పెట్టే యోచనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శిక్షణ విభాగం ఐజీ ఎన్ సంజయ్‌కి తట్టిన ఆలోచనలకి రూపమే ఈ పిన్స్ యాప్.
ఏడాది క్రితం ఏపీ పోలీసులు ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సేవలు తాజాగా పిన్స్ మొబైల్ యాప్ రూపంలో అందరికీ అందుబాటులో వచ్చాయి. ఇప్పటికే ఏపీలోని పోలీసు స్టేషన్లలో వున్న వాహనాల వివరాలు సైతం ఈ యాప్‌లో పొందుపర్చారు. తమకి పట్టుబడిన వాహనాల నిర్వహణ విషయంలో పోలీసులకి, వాహనాలు పోగొట్టుకున్న వారి విషయంలో బాధితులకి మధ్య వారధిగా ఈ యాప్ పనిచేయనుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీకు తెలిసిన వారిలో వాహనాలు పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా వుంటే, వెంటనే వారితో ఈ సమాచారాన్ని పంచుకోండి!