సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర అదనపు డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న లక్ష్మీనారాయణ.. తాను స్వచ్చంద పదవీ విరమణకు పొందేందుకు అనుమతి కల్పించాలని కోరుతూ ఆ రాష్ట్ర డీజీపీకి ఓ లేఖ రాశారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన సత్యం కుంభకోణం, జగన్ అక్రమాస్తుల కేసుల్లో దర్యాప్తు అధికారిగా చురుకైన పాత్ర పోషించిన ఐపీఎస్ ఆఫీసర్గా లక్ష్మీనారాయణ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇవేకాకుండా ఓబులాపురం మైనింగ్ కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు దర్యాప్తుల్లోనూ లక్ష్మీనారాయణ కీలక పాత్ర పోషించారు.
విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించే అధికారిగా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఇప్పుడిలా స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేయడం ఆసక్తి రేపుతోంది. లక్ష్మీనారాయణ స్వచ్చంద పదవీ విరమణ తీసుకోవాలని నిర్ణయించుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటనేదానిపైనే ప్రస్తుతం సర్వత్రా చర్చ నడుస్తోంది. లక్ష్మీనారాయణ చేసుకున్న విజ్ఞప్తిపై మహారాష్ట్ర డీజీపీ ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి!!