అమరావతిలోని తుళ్లూరు మండంలో రూ.150 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ విషయమై టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తాము శ్రీవారి ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలియజేసింది. అలాగే తిరుమలలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు పాలకమండలి ప్రకటించింది.
అన్నింటికన్నా ముఖ్యంగా రూ.79 కోట్ల వ్యయంతో తిరుమల గోవర్ధన అతిథి గృహం వద్ద యాత్రికుల వసతి సముదాయాన్ని నిర్మించాలని తాము యోచిస్తున్నట్లు పాలకమండలి అధికారులు తెలియజేశారు. అలాగే ఉద్యోగులకు సంబంధించి పలు వేతన సవరణలు కూడా చేయనున్నట్లు తెలిపారు. 2015 సంవత్సరంలో ప్రతిపాదించిన పీఆర్సీ సవరణను అనుసరించి దేవాలయ ట్రస్టు రవాణా డిపార్టుమెంటులో డ్రైవర్లు, ఫిట్టర్లకు రూ. 15 వేల నుంచి 24 వేలకు వేతనం పెంచుతున్నామని తెలిపారు. అలాగే తిరుమలలోని భోజన హోటల్స్‌లో కూడా ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందని.. ఈ మేరకు ఒక కమిటీని తాము వేస్తామని పాలకమండలి తెలిపింది.
అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కల్యాణమండపాల అభివృద్ధి పనులకు రూ.37 కోట్లు కేటాయించారు. ఇక శ్రీవారి ఆలయం విషయానికి వస్తే.. అమరావతిలో సీఆర్డీఏ కేటాయించిన 25 ఎకరాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నట్లు పాలకమండలి తెలిపింది. భారతీయ శిల్పకళను ప్రతిబింబించేలా ఓ గొప్ప అద్భుతమైన రాతి కట్టడంగా ఈ ఆలయాన్ని నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణ విషయానికి సంబంధించి త్వరలోనే టెండర్లు కూడా పిలుస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.