కాణిపాకం గుడిలో ఒట్టేస్తావా ? చంద్రబాబుకు తలసాని సవాల్

కాణిపాకం గుడిలో ఒట్టేస్తావా ? చంద్రబాబుకు తలసాని సవాల్

Last Updated : Apr 14, 2019, 02:22 PM IST
కాణిపాకం గుడిలో ఒట్టేస్తావా ? చంద్రబాబుకు తలసాని సవాల్

హైదరాబాద్: తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు రూ.500 కోట్లు ఖర్చు పెట్టారని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ఆరోపించారు. చంద్రబాబు నిజాయతీపరుడే అయితే ఈ విషయంలో పిల్లల్ని తీసుకొనివచ్చి కాణిపాకం వినాయకుడి గుడిలో ఒట్టు వేయాలని, తాను కూడా తన పిల్లల్ని తీసుకొచ్చి ఒట్టు వేస్తానని చంద్రబాబుకు తలసాని సవాల్‌ విసిరారు. చంద్రబాబువి అన్ని అవినీతిపనులేనని, పాలు, కూరగాయలు అమ్మే హెరిటేజ్‌ ద్వారానే రూ.1600 కోట్లు సంపాదించారంటే అదెలా సాధ్యం చెప్పాలని తలసాని డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తలసాని మాట్లాడుతూ.. ఏళ్లు కూడా నిండని తన మనవడి పేరు మీద రూ.85 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో వివరించాలని నిలదీశారు. అవినీతికి చంద్రబాబుకు కేరాఫ్‌ అడ్ర్‌సలా మారారని చంద్రబాబుపై తలసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తనకు అవకాశం కల్పించాలంటూ పోలింగ్‌ రోజున కూడా చంద్రబాబు ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రచారం ముగిసినప్పటికీ టీవీల్లో, పేపర్లలో తన పేరుతో పబ్లిసిటీ లభించడం కోసమే ఎన్నికల అధికారిని కలిసి హైడ్రామా నడిపించారని విమర్శించారు. తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రులపై దాడులు చేస్తున్నారని నోటికొచ్చినట్టు మాట్లాడిన చంద్రబాబు.. అదే నిజమైతే తక్షణమే తన ఆస్తులను అమ్ముకుని తెలంగాణ విడిచిపెట్టి పోవాలని సవాల్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్‌ కన్నా ఎక్కువగా కేసీఆర్‌ పేరునే ప్రస్తావించారంటే చంద్రబాబు పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమైపోతోందని ఎద్దేవా చేశారు.

Trending News