వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( Ysrcp ) అసమ్మతి ఎంపీ, వివాదాస్పద రఘురామకృష్ణంరాజుపై వేటు పడింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించారు. సీబీఐ కేసు పర్యవసానమే ఈ వేటు అని తెలుస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్శాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ( Raghurama Krishnam raju ) వైఖరి ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారింది. సొంత పార్టీపై, పార్టీ విధానాలపై, పార్టీ నేతలపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మూడు రాజధానుల అంశం, ఇంగ్లీషు మీడియం విద్యాబోధన వంటి కీలక నిర్ణయాల్లో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అప్పుడప్పుడుూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) పై కూడా పరోక్షంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పార్టీకు ఆయనొక తలనొప్పిగా మారారన్నది నిర్వివాదాంశం.
ఇక మరోవైపు రుణాల ఎగవేత కేసులో రఘురామకృష్ణంరాజు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ, ఈడీలు ఇటీవలే ఆయన నివాసాలపై సోదాలు నిర్వహించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది సీబీఐ. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది.
ఈ నేపధ్యంలో వైసీపీ ఎంపీగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవిను అనుభవిస్తున్న రఘురామకృష్ణంరాజుపై ఇప్పుడు వేటు పడింది. సీబీఐ కేసు ( CBI Case ) ఫలితంగా ఆయనను పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ కొత్త ఛైర్మన్ గా వైసీపీ ఎంపీ బౌలశౌరిని నియమించారు. లోక్ సభ సచివాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలపై ఇంకా పార్టీ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోలేదు. సీబీఐ కేసు ఫలితంగా ఈ వేటు నిర్ణయం వెనుక పార్టీ ప్రమేయం ఉందా లేదా అనేది ఇంకా తెలియదు. దీనిపై రఘురామకృష్ణంరాజు ఇంకా స్పందించాల్సి ఉంది. Also read; AP: ఆ లేఖ నుంచే చంద్రబాబు అజ్ఞాతంలో వెళ్లిపోయారు: శ్రీకాంత్ రెడ్డి