రాజశేఖర్ సినిమా బడ్జెట్ 25 కోట్లా..!

Last Updated : Oct 8, 2017, 06:07 PM IST
రాజశేఖర్ సినిమా బడ్జెట్ 25 కోట్లా..!

యాంగ్రీ యంగ్ మేన్ పేరుతో ఒకప్పుడు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు డాక్టర్.రాజశేఖర్‌. అన్న, శివయ్య, ఆగ్రహం, మగాడు, అంకుశం, సింహరాశి లాంటి సినిమాలతో తనకుంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ఇమేజ్‌ను సంపాదించుకున్న నటుడు ఆయన. ఇటీవలే రాజశేఖర్ హీరోగా నటించిన ‘గరుడవేగ’ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాని నవంబరు 3న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఓ ఎన్‌ఐఏ ఆఫీసర్ దేశ రక్షణ కోసం ఎలాంటి రిస్క్ చేశాడు అనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించారు. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌కు సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్‌లో కూడా మంచి స్పందనే వచ్చింది. అయితే గత కొంతకాలంగా రాజశేఖర్ చిత్రాలు వరుసగా అపజయాలను పొందుతున్న సమయంలో ఇంత బడ్జెట్‌తో సినిమా నిర్మించడం శ్రేయస్కరమా.. అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కథ మీద నమ్మకం ఉందని.. అలాంటి పవర్ ఫుల్ రోల్ రాజశేఖర్ తప్ప మరొకరు చేయలేరని నమ్మి ఈ చిత్రాన్ని తీస్తున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. పూజా కపూర్, శ్రద్ధా దాస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మరి ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకే చేరుకుంటుందో వేచి చూడాల్సిందే.

Trending News