"రంగస్థలం" సినిమాలో నటి సమంత, రామ్ చరణ్‌లపై తెరకెక్కించిన ‘వేరు శనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకె బిందెలాగే ఎంత సక్కగున్నావే' అనే పాట ఇప్పటికే బాగా పాపులరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట మేకింగ్ వీడియోని యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. పూర్తిగా రాజమండ్రిలో తెరకెక్కించిన ఈ పాటలో నటీనటులు చూపించిన హావభావాలు, ఆ పల్లెటూరి వాతావరణానికి తగినట్లు ఇమిడిపోయి నటించిన తీరు ఇప్పటికే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి.
1985 కాలం నాటి పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తూ.. ఈ సినిమాను తీశారని చెబుతున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి బాణీలు సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని మార్చి 30వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు
రంగస్థలంలోని "ఎంత సక్కగున్నావే" పాటను చంద్రబోస్ రాశారు. నృత్య రీతులను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, అనసూయ భరద్వాజ్, నరేష్, రోహిణి, బ్రహ్మాజీ, పూజా హెగ్డే "రంగస్థలం" చిత్రంలో ముఖ్య తారాగణం. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాకి సంబంధించిన పంపిణీ బాధ్యతలు తీసుకుంటోంది.
దాదాపు రూ.55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రానికి నవీన్ యర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు.