షారుఖ్ ఖాన్ కూతురు ఫిలిం ఎంట్రీపై ఆసక్తికరమైన చర్చ

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ 

Updated: Aug 10, 2018, 05:57 PM IST
షారుఖ్ ఖాన్ కూతురు ఫిలిం ఎంట్రీపై ఆసక్తికరమైన చర్చ

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూతురు సుహనా ఖాన్ బాలీవుడ్‌కి పరిచయం అవుతోందా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం ఆమె ఇటీవల వోగ్ ఇండియా ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై తళుక్కుమనడమే. అవును, ఆగస్టు నెలకు సంబంధించిన వోగ్ ఇండియా ఫ్యాషన్ మ్యాగజైన్ సంచికపై సుహనా ఖాన్ ఇచ్చిన హాట్ ఫోజ్ అప్పుడే కుర్రకారు గుండెల్ని మెలిపెట్టింది. ఇక ఈ అమ్మడిని ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ ఫిలింమేకర్స్ సైతం క్యూ కడుతున్నారట. షారుఖ్ ఖాన్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిన ప్రముఖ ఫిలింమేకర్ కరణ్ జొహర్ అయితే సుహానా ఖాన్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు తాను ఎప్పుడూ రెడీనే అని అనేక సందర్భాల్లో  ప్రకటిస్తూ వస్తున్నాడు. అయితే, షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ మాత్రం కరణ్ కాకుండా మరో ఫిలింమేకర్ సినిమాతో సుహానా ఖాన్‌ని తెరకు పరిచయం చేయించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

2002లో షారుఖ్‌తో దేవదాస్ సినిమాను తెరకెక్కించిన సంజయ్ లీలా భన్సాలీ సైతం సుహానా ఖాన్‌తో సినిమా చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. సుజొయ్ ఘోష్ లాంటి టాప్ డైరెక్టర్స్ కూడా సుహానా ఖాన్‌ని పరిశ్రమకు పరిచయం చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్న వారిలో ఉన్నారు. ఇక సుహానా విషయానికొస్తే, నటనలో ఆమె ఎప్పుడూ ముందే ఉంటోంది. తరచుగా సుహానా ఇస్తున్న థియేటర్ ఆర్ట్స్ ప్రదర్శనలకు షారుఖ్ నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. అయితే, షారుఖ్ మాత్రం సుహానా చదువు పూర్తయ్యే వరకు సినిమాల్లోకి వచ్చే అవకాశమే లేదని చెబుతూ వస్తున్నాడు. అంతిమంగా ఏం జరుగుతుందో మరి!