బిగ్‌బాస్ షో ప్రేక్షకులు చదవాల్సిన పుస్తకమిదే

బిగ్ బ్రదర్ షో సూపర్ హిట్ అయ్యాక.. అనేక దేశాలలో వివిధ భాషల్లో ఈ షో రీ డిజైన్ చేయబడింది. 

Updated: Aug 31, 2018, 12:56 AM IST
బిగ్‌బాస్ షో ప్రేక్షకులు చదవాల్సిన పుస్తకమిదే

అవును.. భావోద్వేగాలతో ఆడుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. కుటుంబం లాంటి సమాజంలో చిచ్చు పెట్టి.. వారు గొడవలు పడుతుంటే చూసి ఆనందించడం వారికి హాబీ. ప్రజలందరూ వారి ఆదేశాలను పాటించాల్సిందే. లేదంటే శిక్షలు విధిస్తారు. తమకు నచ్చిన వారికి కానుకలిస్తారు. నచ్చని వారిని తీవ్రంగా అవమానిస్తారు. ఆ రాజ్యంలో రాజు చెప్పేదే వేదం. ఆ రాజుగారి పేరే బిగ్ బ్రదర్. ఇంతకీ ఈ బిగ్ బ్రదర్ ఎవరనేగా మీ ప్రశ్న. 1949లో జార్జి ఆర్వెల్ అనే రచయిత కలం నుండి జాలువారిన "1984" అనే నవలలోని పాత్రే బిగ్ బ్రదర్.

1984 నవల చాలా విచిత్రంగా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతుందా అని రచయిత ముందుగానే ఆలోచించి తన నవలలో బ్రిటన్ దేశానికి కొత్త పేరు పెడతారు. ఆ దేశం పేరు ఎయిర్ స్ట్రిప్ వన్. ఆ దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడు ఎలా ఉంటాడో జనాలెవరికీ తెలియదు.అయితే రాజ్యంలో ఎక్కడ ఏం జరుగుతుందో.. ఎవరేం మాట్లాడుకుంటున్నారో అన్ని కూడా అధ్యక్షులవారికి ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి. ఎందుకంటే ప్రతీ ఇంట్లో.. ఆ ఇంట్లో వారికి తెలియకుండా ప్రభుత్వమే టెలిస్క్రీన్స్ ఏర్పాటు చేస్తుంది. ఈ సర్వైలెన్స్ నెట్ వర్కు నడిపే ఓ పెద్ద శాఖ కూడా అధ్యక్షుల వారి దగ్గర పనిచేస్తూ ఉంటుంది.

ఈ నిఘా వ్యవస్థను నడిపించే బిగ్ బ్రదర్ ఆ దేశ అధ్యక్షుడు. ఆ నిఘా వ్యవస్థ పేరు "థాట్ పోలీస్". ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరేం మాట్లాడినా ఆ సమాచారం ఆయనకు థాట్ పోలీస్ ద్వారా క్షణాలలో చేరిపోతుంది. వెంటనే అలా మాట్లాడిన వారిని ఖైదు చేస్తారు. అయితే అలాంటి దేశంలోనే విన్ స్టన్ స్మిత్ అనేవాడు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. ఏ విషయం కూడా ప్రభుత్వానికి చేరకుండా జాగ్రత్త పడతాడు. కానీ ఆఖరికి దొరికిపోతాడు. ప్రభుత్వాధికారులు స్మిత్‌ని బంధిస్తారు. చిత్రమేంటంటే.. థాట్ పోలీస్ అధికారులు కొన్ని రహస్య సంఘాల ద్వారా అప్పుడప్పుడు కావాలనే ప్రజలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయమని రెచ్చగొడతారు.

వారు అలా చేసేది ప్రజల నిజాయతీని పరీక్షించడం కోసమని దొరికిపోయిన వారితో అంటుంటారు. స్మిత్ కూడా తెలియక ఆ రహస్య సంఘాల మాయలో పడి ప్రభుత్వానికి దొరికిపోతాడు. దొరికిపోయాక బిగ్ బ్రదర్ స్మిత్ భావోద్వేగాలతో ఆడుకుంటాడు. తాను శిక్ష నుంచి తప్పించుకోవాలంటే.. తన ప్రేయసి జూలీని ఆ నరకకూపంలోకి తీసుకురమ్మని కోరతాడు. కాని స్మిత్ ఒప్పుకోడు. కానీ ఆఖరికి విపరీతమైన టార్చర్ తట్టుకోలేక స్మిత్ తన ప్రేయసిని కూడా మోసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదీ 1984 నవల గురించి చెప్పుకొనే సంక్షిప్త కథ.

ఈ నవల చదివాకే డచ్ మీడియా దిగ్గజం జాన్ డీమోల్ జూనియర్‌కి ఇలాంటి విచిత్రమైన ఆలోచనలతో ఓ టీవీ షో ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అప్పటికే ఆయన ఫియర్ ఫ్యాక్టర్, డీల్ ఆర్ నో డీల్ లాంటి సూపర్ హిట్ టెలివిజన్ షోలకు నిర్మాతగా వ్యవహరించారు. తొలుత సామాన్య వ్యక్తులతోనే ఈ షో ప్రారంభించాలని అనుకున్నారు. 16 మంది వ్యక్తులను సమాచార వ్యవస్థకు దూరం చేసి ఓ ఇంటిలో బంధించి వారి బాగోగులు బిగ్ బ్రదర్ మాత్రమే చూస్తూ.. ఒక కుటుంబం లాంటి ఆ గుంపు మధ్య వివాదాలు కల్పించి.. వారిలో పోటీతత్వాన్ని పెంచి.. ఈ ప్రహసనమంతా టివి ద్వారా ప్రేక్షకుడికి ఆనందం పంచే విధంగా డిజైన్ చేయడమే ఈ షో లక్ష్యం.బిగ్ బ్రదర్ షో సూపర్ హిట్ అయ్యాక.. అనేక దేశాలలో వివిధ భాషల్లో ఈ షో రీ డిజైన్ చేయబడింది. ఇండియాలో కూడా ఈ షో అసలైన నిర్మాతలైన ఎండమోల్ గ్రూప్ వారే నిర్మాతలుగా మారారు. పేరు కూడా మార్చారు. బిగ్ బ్రదర్ బదులు బిగ్ బాస్ అని పేరుపెట్టారు