తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటి జయంతి మంగళవారం రాత్రి కన్నుమూశారు అనే వార్తల్లో నిజం లేదని.. ఆమె కోలుకుంటున్నారని ఆమె కుమారుడు కృష్ణకుమార్ స్పష్టం చేశారు. ఆమె ఆరోగ్యంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. అనారోగ్యంతో ఆమె సోమవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. శ్వాస కోశ సంబంధిత సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. నిజానికి ఆమె ఆరోగ్యం క్రితం కంటే మెరుగైందని తెలిపారు. ప్రస్తుతం ఆమెకు కృత్రిమశ్వాస (వెంటిలేటర్) మీద చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.
దక్షిణాదిన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళంతోపాటు మరాఠి భాషల్లో సినిమాలు చేసిన జయంతి.. తన కెరీర్‌లో మొత్తం 500లకు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులోనూ తొలితరం నటుల సరసన జంటగా నటించిన జయంతి ఆ తర్వాతి తరం స్టార్ హీరోలకు తల్లి పాత్రల్లోనూ మెప్పించారు. తెలుగులో బాగా పేరు తెచ్చిన పాత్ర.. పెదరాయుడు సినిమాలో పాపరాయుడి చెల్లెలి పాత్ర. తెలుగులో జగదేకవీరునికథ, డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం, కొండవీటి సింహం, దేవదాసు, కంటే కూతుర్నే కను, జస్టిస్ చౌదరి, బడిపంతులు, వంశానికొక్కడు, స్వాతి కిరణం, కొదమ సింహం, కొండవీటి సింహం, అమ్మ మనసు, భక్త ప్రహ్లాద, రాజా విక్కమార్క, ఘరానా బుల్లోడు, శారద లాంటి పేరు పొందిన సినిమాల్లో నటించారు. జయంతి ఉత్తమ నటిగా రెండుసార్లు కర్ణాటక ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు.