మాజీ సీఎం చంద్రబాబు నడిపిన కారులో ప్రస్తుత జగన్ షికారు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అర్థమై అర్థం కానట్లుగా ఉంది కదూ... అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే తెలుస్తుంది.
అనంతపురం కేంద్రంగా స్థాపించిన తయారీ యూనిట్ నుంచి అంతర్జాతీయ కార్ల దిగ్గజ సంస్థ కియా కొత్త కారును మార్కెట్లో ప్రవేశపెడుతోంది. సెల్టోస్ పేరుతో తయారౌతున్న ఈ ఎస్ యూవీకి ఇప్పటికే భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ఆగస్టు 8న తొలి కారు ఆవిష్కరించాలని ముహుర్తం ఫిక్స్ చేసుకున్న కియా మోటార్స్ ప్రతినిధులు..ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఆహ్వానించారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది
అంతర్జాతీయ కార్ల దిగ్గజం కియా సంస్థ అనంతపురం జిల్లా పెనుకొండలో సుమారు రూ.13 వేల కోట్ల పెట్టుబడితో భారీ యూనిట్ నిర్మించారు. గతేడాది అప్పటి సీఎం చంద్రబాబు సమక్షంలో కియా కారు ట్రయల్ రన్ నిర్వహించగా... ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు కారు నడిపి కొంత దూరం హల్ చల్ చేశారు. ఇప్పుడు అదే కారును సీఎం హోదాలో జగన్ మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నారు. ఇలా కియా కారులో జగన్ కూడా షికారు చేసేందుకు రెడీ అవుతున్నారు.