ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇంటిలో చోరికి ప్రయత్నించి ఓ యువకుడు కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఆళ్వారుపేట ఎల్డామ్స్ రోడ్ ప్రాంతంలో నటుడి కమల్ హాసన్ ఇల్లు ఉంది. ఇటీవలే ఈ ఇంటిని "మక్కల్నీది మయ్యం" పార్టీ ప్రధాన కార్యాలయంగా మార్చారు. ఎప్పుడూ పలువురు సెక్యూరిటీ అధికారులు ఆ ఇంటిని పర్యవేక్షిస్తూ ఉంటారు.
ఇటీవలే సెక్యూరిటీ కళ్లు కప్పి ఓ యువకుడు ఆ ఇంటి ప్రహారి గోడను దాటి లోపలికి ప్రవేశించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషనులో అప్పగించారు. ఆ యువకుడు దిట్టకుడి ప్రాంతానికి చెందిన వ్యక్తని విచారణలో తేలింది. తాను దొంగతనం కోసం ఆ ఇంటిలోకి ప్రవేశించినట్లు ఒప్పుకొన్న యువకుడు.. తనకు ఆ ఇల్లు కమల్ హాసన్దని మాత్రం తెలియదని చెప్పడం గమనార్హం. కాగా, ఈ విషయంపై కమల్ హాసన్ నుండి ఎలాంటి సమాచారమూ లేదు.
ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న "విశ్వరూపం 2" చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం తర్వాత "శభాష్ నాయుడు" చిత్రం కూడా ఆయన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా... కమల్ హాసన్ తన పార్టీ "మక్కల్నీది మయ్యం" వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు.
కమల్ హాసన్ ఇంటిలో చోరీకి ప్రయత్నం..!