భారతదేశం అనేక యుద్ధకళలకు పుట్టిల్లు. రామాయణ, మహాభారత కాలం నుండి ఈ యుద్ధకళలు సుపరిచితం. ఉత్తరభారతదేశంలో శస్త్రవిద్య పేరిట 10 రకాల యుద్ధకళలు ఉండేవని చరిత్రను అధ్యయనం చేసేవారు చెబుతుండడం గమనార్హం. అగ్ని పురాణం, అర్థశాస్త్రం లాంటి గ్రంథాలలో కూడా యుద్ధకళల ప్రశస్తి ఉంది. ఒకప్పుడు గురుకులాల్లో విద్యార్థులకు అక్షర విద్యతో పాటు యుద్ధకళలకు సంబంధించిన విద్యను కూడా బోధించేవారు. రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ధీర వనితలు కూడా యుద్ధకళల్లో నిష్ణాతులే. ఈ క్రమంలో భారతదేశానికి సంబంధించిన టాప్ టెన్ యుద్ధకళల గురించి మనం కూడా తెలుసుకుందాం..!
కలరిపయట్టు - కేరళతో పాటు తమిళనాడు, కర్నాటక ప్రాంతాల్లో బాగా పాపులర్ అయిన ఈ యుద్ధకళను ప్రధానంగా 8 టెక్నిక్స్‌ను ఆధారంగా చేసుకొని ప్రాక్టీసు చేస్తారు. ఆ 8 టెక్నిక్స్ కూడా ఎనిమిది జంతువులను పోలి ఉంటాయి. ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఈ యుద్ధకళలో ప్రధానమైన అంశం. పలు ప్రాంతాల్లో ఆయుధాన్ని ఆధారంగా చేసుకొని ఈ కళకు సంబంధించిన పోటీలు నిర్వహిస్తే.. మరికొన్ని చోట్ల ఆయుధాన్ని ఉపయోగించకుండా కూడా నిర్వహిస్తుంటారు.
శిలంబం - ఈ యుద్ధకళలో ఆయుధమే ప్రధానం. తమిళనాట పుట్టిన ఈ క్రీడలో దాదాపు 18 శైలులు ఉన్నాయి. వెదురు కర్రలను కొన్ని చోట్ల ఈ కళను అభ్యసించడానికి ఉపయోగిస్తే.. మరి కొన్ని చోట్ల కత్తులు, కటార్లు కూడా ఉపయోగిస్తుంటారు. తమిళనాడులో పాండ్య, చోళ, చేర రాజులు పరిపాలిస్తున్న రోజుల్లో ఈ కళ బాగా అభివృద్ది చెందింది.
తంగ్‌తా మరియు సరిత్ సరక్ - మణిపూర్ రాష్ట్రంలో ఈ కళలు ఒక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ కళల్లో "తంగ్ తా"లో కత్తులను ఉపయోగించి క్రీడాకారులు పోరాటానికి సిద్ధమైతే.. సరిత్ సరక్ క్రీడలో కత్తులకు బదులు చేతులను ఉపయోగిస్తారు. 17వ శతాబ్దంలో బ్రిటీష్ వారు ఈశాన్య రాష్ట్రాల్లోకి చొచ్చుకొని వచ్చాక.. ఈ క్రీడలను కొన్నాళ్లు బ్యాన్ చేశారు. అయితే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అతి ప్రాచీన క్రీడలు ఇవి.
గట్కా - పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన అతి ప్రాచీన యుద్ధక్రీడ గట్కా. కిర్పాన్, తల్వార్, కటార్ లాంటి ఆయుధాలను ఉపయోగించి ఈ క్రీడను ఆడడం జరుగుతుంది. సిక్కులు ఎక్కువగా ఈ క్రీడను ఆడతారు. ఒక పౌరుషానికి ప్రతీకగా ఈ క్రీడను నిర్వహించడం జరుగుతంది. ముఖ్యంగా సిక్కు పండగలప్పుడు, భారతీయ పండగలైన గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా ఈ ఆటను ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు.
మర్మకళ - ఈ కళపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శుశ్రుత సంహిత ప్రకారం మనిషి శరీరంలో 108 మర్మ కేంద్రాలుంటాయని ప్రతీతి. ఈ కేంద్రాలను ఆధారంగా చేసుకొని మనిషిని కొట్టగలిగితే.. ప్రాణాలు సైతం పోతాయని అంటారు. కేరళ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ కొందరు మర్మ యోధులు రహస్యంగా ఈ విద్యను నేర్పిస్తున్నారని అంటారు.
ఇన్బుయాన్ రెజ్లింగ్ (మల్లయుద్ధం) - మిజోరం ప్రాంతానికి చెందిన సంప్రదాయ మల్ల యుద్ధ క్రీడ ఇది. పట్టు, బిగింపులతో ఈ క్రీడను ఆడతారు. బర్మా నుండి ఈ క్రీడ మిజోరం వాసులకు సంక్రమించిందని కూడా పలు వాదనలు ఉన్నాయి. 17వ శతాబ్దంలో ఈ క్రీడ పుట్టిందని చరిత్ర చెబుతోంది.
కుట్టు వరిసాయ్ - దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఒకప్పుడు ఈ క్రీడకు ఆదరణ ఉండేది. సంగమ్ సాహిత్యంలో కూడా ఈ క్రీడ ప్రశస్తి ఉంది. సర్పం, గరుడ, గజం, వ్యాఘ్రం, కపి అని జంతువుల పేర్లతో విభజించి ఈ క్రీడను ఆడతారు. పట్టు విడిపించుకోవడం అనేది ఈ క్రీడలో ప్రధానమైన అంశం. కుంగ్ ఫూ, కరాటేలను పోలి ఉంటుంది ఈ క్రీడ. ఈ క్రీడలో మంచి ఫలితం సాధించాలంటే జిమ్నాస్టిక్స్, యోగా లాంటి వాటిలో నిష్ణాతులై ఉండాలని అంటారు. ఈ ఆట కూడా కొంతవరకు శిలంబంనే పోలి ఉంటుంది.
ముష్టి యుద్ధం - వారణాశిలో తొలిసారిగా ముష్టి యుద్ధానికి అంకురార్పణ జరిగింది. కికింగ్, పంచింగ్ అనేవి ఈ క్రీడలో ప్రధానాంశాలు. పురాణముల్లో కూడా ముష్టి యుద్ధాలకు సంబంధించిన ప్రశస్తి ఉంది. పురాణాల్లో పాత్రల పేర్లనే ముష్టి యుద్ధంలో టెక్నిక్స్‌కు పెట్టడం జరిగింది. పోటీలో ఎదుటి మనిషిని నియంత్రించగలిగితే ఆ పట్టును జంబువంతి అంటారు. అలాగే అపారమైన బలంతో ఎదుటి మనిషిని నిలువరించగలిగితే.. ఆ టెక్నిక్‌ను హనుమంతి అంటారు. ఎదుటి మనిషి బలాన్ని అంచనా వేస్తూ.. సమయస్ఫూర్తితో వ్యవహరించగలిగితే ఆ టెక్నిక్‌ను భీమసేని అంటారు. ఎదుటి మనిషి మడమలు, పక్కటెముకల మీద గురి పెట్టి నియంత్రణకు ప్రయత్నిస్తే ఆ టెక్నిక్‌ను జరాసంధి అంటారు.
పరి ఖండా - బీహార్‌లో రాజపుత్రుల హయాం నుండీ ఉన్న విద్య ఇది. ఇందులో కత్తిని, డాలుని ప్రధాన ఆయుధాలుగా వాడతారు.
కత్తిసాము - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజవంశీయుల నుండి సంక్రమించిన వారసత్వ యుద్ధకళ కత్తిసాము. బొబ్బిలి, విజయనగర రాజుల హయంలో కత్తిసాము అతి ప్రాచుర్యం కలిగిన యుద్ధక్రీడగా వినుతికెక్కింది.