లక్నోలోని షాహదత్గంజ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ మదర్సలో 51 మంది బాలికలని బంధించిన మదర్స మేనేజర్ వారిపై లైంగిక వేధింపులకి పాల్పడుతున్న వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. మదర్సకు ఇరుగుపొరుగున వున్న వారు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో మేనేజర్ అరాచకాలు బట్టబయలయ్యాయి. బాలికల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు శుక్రవారం మదర్స మేనేజర్ని అరెస్ట్ చేసి అతడి చేతిలో బంధీలుగా వున్న బాలికలకు విముక్తి కల్పించారు. మదర్సలో మొత్తం 125కిపైగా బాలికలు వుండగా తాము దాడులు జరిపినప్పుడు మదర్సలో బంధీలుగా వున్న 51 మందిని రక్షించినట్టు పోలీసులు తెలిపారు.
మదర్సలో బంధీలుగా వున్న బాలికలు తమ దుస్థితిని తెలియజేస్తూ కొన్ని పేపర్లపై తమ ఆవేదనను రాసి కిటికీల్లోంచి బయటపడేయగా అవి చదివిన ఇరుగుపొరుగు వారు తమకి సమాచారం అందించారని పోలీసులు మీడియాకు వివరించారు. బాధితుల వాంగ్మూలాలు నమోదు చేసిన పోలీసులు.. మదర్స మేనేజర్ అరాచకాలపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందిస్తూ ఓ నివేదిక పంపించారు.