కాంగ్రెస్ కార్యకర్తలారా..! ముందస్తు ఎన్నికలకు సిద్ధంకండి..!!

కాంగ్రెస్ కార్యకర్తలారా..! ఎన్నికలకు సిద్ధం కండి

Last Updated : Feb 4, 2018, 04:24 PM IST
కాంగ్రెస్ కార్యకర్తలారా..! ముందస్తు ఎన్నికలకు సిద్ధంకండి..!!

"2019లో జరగబోయే సాధారణ ఎన్నికలు, ఈ ఏడాది నవంబరులో జరగడానికి 90 శాతం అవకాశం ఉంది" అని రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్.. తన ప్రసంగంలో  తొలిసారి ముందస్తు ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారని అన్నారు. ప్రధాని మోదీ నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' లో తరచుగా 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అనే అంశాన్ని మాట్లాడుతున్నారని కార్యకర్తలకు సూచించారు.

"మీరు చాలా సంవత్సరాలు పార్టీకి సేవలందించారు. అదే శక్తితో వచ్చే ఎన్నికలలో పార్టీ విజయానికి దోహదపడాలి" అని దిశానిర్దేశం చేశారు ఆజాద్.   

రాజస్థాన్ ఉపఎన్నికల్లో ఓటమి తరువాత.. అధికార పార్టీ గుండెల్లో గుబులు పుట్టిందని, లోక్సభ ఎన్నికల వరకు వారు వేచి చూసే ధోరణిలో లేరని సీనియర్ కాంగ్రెస్ సభ్యులు చెప్పారు. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కూడా ముందస్తు ఎన్నికల సంకేతాలను సూచించిందని వివరించారు.

"ప్రభుత్వం బలహీనతలను గుర్తించి.. బడ్జెట్ లో రైతులపై దృష్టి సారించింది. ప్రభుత్వం పంట గిట్టుబాటు ధరను పెంచింది. కానీ అక్టోబర్ వరకు వారు ఇవ్వలేరు. తదుపరి పంట సిద్ధంగా ఉన్న సమయానికి, ఎన్నికలు అని ప్రకటిస్తారని, ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది" అని కాంగ్రెస్ ఎంఎల్ఏ ఆరాధన మిశ్రా చెప్పారు.

Trending News