త్వరలో విమాన ధరలు పెరగనున్నాయి. విమాన ఇంధన ధరలు (ఏటీఎఫ్) మరింత పెరిగే అవకాశం ఉండటంతో పాటు రూపాయి ధర క్షీణిస్తుండటంతో టికెట్ల ధరలను పెంచాలని విమానయాన సంస్థలు భావిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు డిస్కౌంట్లు, తక్కువ ధరకు విమాన టికెట్లను అందించిన విమానయాన సంస్థలు ఇప్పుడీ నిర్ణయం తీసుకోనుండటం గమనార్హం. ఏటీఎఫ్ ధర పెంపుతో పాటు కేంద్రం దీనిపై 5 శాతం సుంకాన్ని విధించనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పండగ సీజన్ నుంచి ధరల పెంపును అమలు చేయాలని విమానయాన సంస్థలు భావిస్తున్నట్లు సమాచారం. ఇంధన ధరలే అధికం అనుకుంటే వివిధ రాష్ట్రాలు విధిస్తున్న సెస్‌తో ఎయిర్‌లైన్స్‌లు ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. కేంద్ర సుంకం వల్లే ఒక్కో ఎయిర్ లైన్స్‌పై నెలకు 25 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అంచనా.
ప్రభుత్వ రంగంలోని ఎయిరిండియా, ప్రైవేటు సంస్థ జెట్ ఎయిర్వేస్ వంటి ఎయిర్‌లైన్స్ సంస్థల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. రానున్న రోజుల్లో మరిన్ని సంస్థల పరిస్థితి కూడా ఇదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే టికెట్ ధరను పెంచాల్సింది ఒక్కటే మార్గమని పేర్కొన్నారు.
‘టికెట్ ధరలు పెరిగితే దేశీయ విమాన సంస్థల చార్జీలు అధికంగా ఉంటాయి. దీంతో ప్రయాణికులు విదేశీ సంస్థ విమానాల వైపుకు మళ్లే అవకాశం ఉంది. ఇది మరింత ప్రమాదకరం.’ అని స్పైస్ జెట్ చైర్మన్ అజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు.