న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయకూడదనే డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు పౌర జీవనాన్ని పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆందోళనకారులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేసి, తగలబెడుతున్న వైనం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఆందోళనకారులు పలు చోట్ల ఆర్టీసీ బస్సులను తగలపెట్టిన సంగతి తెలిసిందే. ఇంకొన్ని చోట్ల మెట్రో రైలు స్టేషన్లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను సిబ్బంది గేట్ వద్దే అడ్డుకుని గేట్లు మూసేసిస సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం కూడా ఢిల్లీలో ఆందోళనలు జరుగుతుండటంతో ఢిల్లీ మెట్రో రైల్వే అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లోని 19 మెట్రో స్టేషన్లను మూసేశారు. రాజీవ్ చౌక్, జన్‌పథ్ బారాఖంబా, జామియా మిలియా ఇస్లామియా, జశోలా విహార్, షాహీన్ బాగ్, మునిర్క, లాల్ ఖిలా, జమా మసీద్, చాందినీ చౌక్, విశ్వవిద్యాలయ, పటేల్ చౌక్, లోక్ కల్యాణ్ మార్గ్, ఉద్యోగ్ భవన్, ఐటిఓ, ప్రగతి మైదాన్, సెంట్రల్ సెక్రటేరియట్, ఖాన్ మార్కెట్, వసంత్ విహార్, మండి హౌజ్ మెట్రో స్టేషన్లను మూసేశామని.. రైళ్లు ఇక్కడ ఆగవని ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో ఆయా మెట్రో స్టేషన్ల నుంచి నిత్యం రాకపోకలు సాగించే తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పౌరులు ఆవేదన వ్యక్తంచేశారు.
రోడ్డు రవాణాపై ఆందోళనల ప్రభావం..
ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు నిరసనకు దిగడంతో రోడ్డు రవాణా వ్యవస్థపై సైతం ఆందోళనల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లోని పలు మార్గాల్లో వాహనాల తనిఖీ జరుగుతుండటంతో పాటు ఇంకొన్ని మార్గాల్లో వాహనాలను అనుమతించకుండా పోలీసులు ఆంక్షలు విధించడంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది. దీంతో అనేక మార్గాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
ఎర్రకోట పరిసరాల్లో కర్ఫ్యూ..
ఎర్రకోట నుంచి షాహీద్ పార్క్, ఐటీఓ వరకు శాంతియుత నిరసన తెలియజేస్తూ ర్యాలీ చేపడతామని స్వరాజ్ అభియాన్ చేసుకున్న విజ్ఞప్తికి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. అంతేకాకుండా ఎర్రకోట పరిసరాల్లో ఎటువంటి ర్యాలీలకు తావు లేకుండా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు జాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించారు. ఈ నెల 15వ తేదీ నుంచి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిత్యం ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.