ఐటీ రిటర్న్స్ దాఖలుకు 21 రోజుల డెడ్‌లైన్ విధించిన సీబీడీటీ

ఐటీ రిటర్న్స్ దాఖలుకు మరో డెడ్‌లైన్ విధించిన సీబీడీటీ

Last Updated : Feb 23, 2019, 12:27 PM IST
ఐటీ రిటర్న్స్ దాఖలుకు 21 రోజుల డెడ్‌లైన్ విధించిన సీబీడీటీ

న్యూఢిల్లీ: 2018-19 సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనివారికి మరో అవకాశం కల్పించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) విభాగం అందుకు 21 రోజుల గడువు విధించింది. ఆదాయపన్ను చట్టం కింద చట్టరీత్యా చర్యలు ఎదుర్కోకుండా వుండేందుకు ఇది సదవకాశంగా సీబీడీటీ పేర్కొంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తంలో లావాదేవీలు జరిపిన వారిలో కొంతమంది ఆ సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఇప్పటివరకు దాఖలు చేయలేదని సీబీడీటీ స్పష్టంచేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనివారు 21 రోజుల్లోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని, లేనిపక్షంలో ఆన్‌లైన్ ద్వారా స్పందించాలని సీబీడీటీ వెల్లడించింది. 

ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుండా ఆన్‌లైన్‌లో వివరణ ఇచ్చిన వారి వివరణ సంతృప్తికరంగా ఉందని అనిపిస్తే, వారి వివాదాన్ని అంతటితో ముగిస్తామని సీబీడీటీ తెలిపింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని వారిపై, లేదా స్పందించని వారిపై ఆదాయపన్ను చట్టం 1961 కింద చట్టరీత్యా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీబీడీటీ అధికారి తెలిపారు. ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ఇన్‌కమ్ టాక్స్ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేకుండా ఈ-వెరిఫికేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు సీబీడీటీ అధికారి వివరించారు.

Trending News