కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యలో సీట్లు ఏ పార్టీకీ రాకపోవడంతో అక్కడి రాజకీయాల్లో రసవత్తర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సహాయంతో జేడీఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అంతేకాకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి లాక్కోవాలని ప్రయత్నిస్తోన్న బీజేపీ నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బెంగుళూరులోనే ఏకంగా ఓ రిసార్ట్‌ని అద్దెకి తీసుకుని, పార్టీ ఎమ్మెల్యేలను అందులోకి తరలించింది. బెంగుళూరులోని ఈగల్టన్ రిసార్ట్‌లో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను దాచినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, ఇప్పటికే పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఆచూకీ కనిపించడం లేదు అని వస్తోన్న ఆరోపణలను ప్రస్తుత కేర్ టేకర్ సీఎం సిద్ధరామయ్య కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను అందరిని సురక్షితంగా కాపాడుకుంటోంది అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అమర్ గౌడ లింగన్న గౌడ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిందని, బీజేపీకి మద్దతు ఇస్తే, కేబినెట్‌లో చోటు ఇవ్వడానికి సిద్ధంగా వున్నామని ఆ పార్టీ తనతో సంప్రదింపులు జరిపినట్టు అలీ తెలిపారు. జేడీఎస్ ఎమ్మెల్యే డానిష్ అలీ మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఒకవేళ కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని ఆహ్వానించనట్టయితే, ఇక అంతటితో ప్రజాస్వామ్యం కూనీ అయినట్టేనని అన్నారు.