న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెలాఖర్లో స్విర్జర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న 'వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్' లో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. అమెరికా తరుఫున ట్రంప్, భారత్ తరుఫున నరేంద్ర మోదీ ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
దావోస్ లో జనవరి 23-26 వరకు 'వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్' జరగనుంది. ఈ సదస్సులో 350 మంది రాజకీయనాయకులు హాజరవుతారు. ప్రపంచ దేశాల నుంచి అర్థివేత్తలు, ప్రధాన కంపెనీ సీఈవోలు కూడా హాజరవుతారు.
దావోస్ సదస్సులో ఓ భారత ప్రధాని 1997 తర్వాత పాల్గొనటం ఇదే తొలిసారి. ప్రతిష్టాత్మక గ్లోబల్ బిజినెస్ కమిషన్ యొక్క ప్లీనరీ సెషన్ లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నట్లు వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు మంగళవారం ప్రకటించారు. జనవరి 23న ప్రారంభోత్సవ సమావేశంలో మోదీ ప్రసంగిస్తారని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు కూడా 18 ఏళ్ల తర్వాత ఈ సదస్సులో పాల్గొంటున్నారు. దీనిపై వైట్ హౌస్ స్పందిస్తూ.. అధ్యక్షుడు ట్రంప్ తన ఫస్ట్ అమెరికా అజెండాను ప్రపంచనేతలతో పంచుకునేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సరైన వేదిక అని తెలిపింది.