న్యూఢిల్లీ: ధన త్రయోదశి సమీపిస్తుండటంతో బంగారు ఆభరణాలు ధరించడాన్ని ఇష్టపడే మగువల నుంచి మొదలుకుని బంగారాన్ని విక్రయించే వ్యాపారుల వరకు అందరి దృష్టంతా బంగారం ధరలపైనే ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ధన త్రయోదశి నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే, అదృష్టం కలిసి వస్తుందనే విశ్వాసమే ఆ రోజుకు అంత ప్రత్యేకతను తీసుకొచ్చింది. అయితే, ప్రస్తుతం బంగారం ధరలపై బ్రెగ్జిట్ వ్యవహారం, చైనా-యూఎస్ ట్రేడ్ వార్ తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో గత మూడు రోజులుగా మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే.. బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదవుతున్నట్టుగానే కనిపిస్తోంది. మంగళవారం నాడు దేశీయ మార్కెట్‌లో ట్రేడింగ్ అయిన బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు రూ.50 తగ్గి రూ.39,950గా నమోదు కాగా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర పది గ్రాములకు రూ.40 తగ్గి రూ.36,620కి పడిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ.50 తగ్గి రూ.38,600గా నమోదు కాగా, 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ.50 తగ్గి రూ.37,400గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.10 శాతం తగ్గి 1,486.20 డాలర్లకు పడిపోయింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ కొనసాగడంతోపాటు దేశీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ మందగించడం బంగారం ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే, ధన త్రయోదశి వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందా లేదా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక వెండి ధర విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.48 వేల వద్ద నిలకడగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర ఔన్స్‌కు 0.43 శాతం తగ్గి 17.50 డాలర్లకు చేరుకోగా దేశీయ మార్కెట్‌లో ఆ ప్రభావం అంతగా కనిపించలేదు.