రైలు ప్రయాణీకులకు గుడ్ న్యూస్. భారతీయ రైల్వే ఏసీ టికెట్ ధరలను తగ్గించింది. ప్రయాణీకులు ఏసీ కోచ్‌లలో ప్రయాణించాలన్న ముఖ్య ఉద్దేశంతో భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. నైరుతి రైల్వే జోన్ పరిధిలోని బెంగళూరు, మైసూరు, గడగ్ నుంచి నడిచే ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ టికెట్ ధరలు తగ్గించామని రైల్వే అధికారి ఒకరు ఐఏఎన్ఎస్ వార్తాసంస్థకు చెప్పారు.
'మైసూరు నుండి చెన్నై వయా బెంగళూరు మీదుగా వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ చైర్ కార్ టికెట్ ధరలను తగ్గించడంతో ప్రయాణీకులు బస్, ఫ్లైట్లలో కంటే ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్‌లో ప్రయాణించడానికి మొగ్గుచూపుతున్నారు' అని రైల్వే ప్రతినిధి ఐఏఎన్ఎస్ వార్తాసంస్థకు చెప్పారు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి యశ్వంత్‌పూర్- హుబ్బళి మధ్య నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైల్లో కూడా ఏసీ చార్జీలను రూ.735 నుంచి రూ.590కు తగ్గించామన్నారు.
మరో మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రానున్న రోజుల్లో ఏసీ కోచ్ టికెట్ ధరలను తగ్గిస్తామని అధికారి చెప్పారు. నివేదికల ప్రకారం, డిసెంబర్ 3 నుండి మైసూరు-షిర్డీ వీక్లీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఏసీ చార్జీలు రూ.490 నుంచి రూ.260కు, నవంబర్ 30 నుంచి యశ్వంత్‌పూర్-బికనీర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఏసీ చార్జీలు రూ.735 నుంచి రూ.590కు (థర్డ్ ఏసీ), నవంబర్ 22 నుంచి యశ్వంత్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఏసీ చార్జీలు రూ.345 నుంచి రూ.305 (థర్డ్ ఏసీ)కు తగ్గనున్నాయి. డిమాండ్-సరఫరా నిష్పత్తి ప్రకారం, అప్పుడున్న పరిస్థితికి తగ్గట్టు టికెట్ ధరల్లో మార్పులు ఉండవచ్చని అధికారి తెలిపారు.
అటు రైలు ప్రయాణం సమయంలో ప్రయాణీకుల సౌకర్యార్థం.. భారతీయ రైల్వే ఎయిర్ కండిషన్డ్ కోచ్లలో ఉన్ని దుప్పట్ల బదులు.. వాటి స్థానంలో ఉన్నత నాణ్యమైన నైలాన్ దుప్పట్లను ఇవ్వాలని నిర్ణయించింది.