69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో రంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల నుండి ప్రాతినిథ్యం వహించిన శకటాలు అందంగా ముస్తాబై అందరికీ కనువిందు చేశాయి. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల సంప్రదాయాలను, చరిత్రను చాటడమే ప్రధాన లక్ష్యంగా పరేడ్‌లో పాల్గొన్న ఈ శకటాలు పలువురిని ఆకర్షించాయి. ఈ సారి ప్రభుత్వ సంస్థల శకటాలు కూడా ఈ వేడుకల్లో పాల్గొని సందేశాత్మక మోడల్స్‌గా నిలవడం గమనార్హం.
ఈ శకటాల్లో ముఖ్యంగా ఆకాశవాణి థీమ్‌తో తయారుచేసిన మోడల్ పలువురిని ఆకర్షించింది. గాంధీ బొమ్మతో పాటు పలువురు సంగీత కళాకారుల బొమ్మలు, సైనికుల బొమ్మలను ఈ శకటంలో చూడవచ్చు.
అలాగే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వారి శకటంలో పశువులపై పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులను, మొక్కలను పరిశీలిస్తున్న జీవశాస్త్ర నిపుణులను చూడవచ్చు.
కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ శకటంలో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ సెక్టార్ వారి "ఉచిత్ దామ్ హక్ కే మాంగ్" అనే విధానాన్ని చూడవచ్చు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వారి శకటం మోడల్‌లో ప్రఖ్యాత కై బౌద్ధాశ్రమాన్ని చూడవచ్చు.
మహారాష్ట్ర రాష్ట్రం వారి శకటంలో ఛత్రపతి శివాజీ చరిత్రను ప్రస్తావించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం వారి శకటంలో సాంచీ బౌద్ధ ఆశ్రమాలను గురించి తెలపడం గమనార్హం
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర శకటంలో రాంగఢ్‌కి చెందిన పురాతన యాంపీ ధియేటర్ గురించి తెలిపారు
లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంత శకటాన్ని "ఐలాండ్ ఆఫ్ జాయ్" అనే కాన్సెప్ట్‌తో రూపొందించారు
జమ్మూ అండ్ కాశ్మీర్ వారి శకటంలో ప్రధానంగా ఆ రాష్ట్ర సంప్రదాయ, సంస్కృతులను గురించి ప్రస్తావించడం జరిగింది
ఉత్తరాఖండ్ వారి శకటంలో రూరల్ టూరిజం గురించి ప్రస్తావించారు
త్రిపుర రాష్ట్రానికి చెందిన శకటంలో ఆ రాష్ట్ర చేనేత పరిశ్రమలను గురించి మోడల్ తయారుచేశారు