మహారాష్ట్రలో 'కరోనా వైరస్' విలయ తాండవం చేస్తోంది. కేవలం 14 రోజుల్లోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపైంది. దీంతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం ఉంది.
ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల సంఖ్య దాదాపు 60వేలకు చేరువలో ఉంది. అంటే దేశంలో సగం కంటే కాస్త తక్కువ కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదయయ్యాన్నమాట. మహారాష్ట్రలో ప్రస్తుతం కేసుల సంఖ్య 54 వేల 758గా ఉంది. నిన్న ఒక్కరోజే 327 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1792 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మహారాష్ట్రలో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. గత రెండు నెలల నుంచి 24 గంటల డ్యూటీ చేస్తున్నారు. ఐతే కరోనా వైరస్ ను ఎదుర్కుంటూ పోరాడుతున్న వారు.. వైరస్ బారిన పడుతున్నారు. గత 24 గంటల్లో 75 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారికి పరీక్షల్లో పాజిటివ్ ఫలితం వచ్చిందని మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటి వరకు మొత్తంగా కరోనా బారిన పడ్డ పోలీసుల సంఖ్య 1964కు చేరుకుంది. కరోనా మహమ్మారికి 20 మంది పోలీసులు బలయ్యారు. ఐతే ఇప్పటి వరకు 849 మంది పోలీసులు కరోనా నుంచి సురక్షితంగా బయటపడగా.. మరో వెయ్యి 95 మంది పోలీసులు కరోనా రాకాసితో పోరాటం సాగిస్తున్నారు.
మరోవైపు కరోనా మహమ్మారి విస్తృతంగా విస్తరిస్తున్నప్పటికీ .. మరణాల రేటు తగ్గిందని మహారాష్ట్ర సర్కారు వెల్లడించింది. గత ఏప్రిల్ తో పోలిస్తే 3.25 శాతం మరణాల రేటును తగ్గించినట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్ మెహతా స్పష్టం చేశారు. ఏప్రిల్ లో మరణాల రేటు 7.6 శాతంగా ఉండేదన్నారు. మరోవైపు కరోనా వైరస్ పాజిటివ్ లకు చికిత్స అందించేందుకు ముంబైలో 75 వేల పడకల ఆస్పత్రి సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కరోనా పరీక్షల కోసం అదనంగా 27 ల్యాబ్ లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 72 ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
'మహా' విలయం..!!